హర్రర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కానీ మధ్యలో వచ్చిన హర్రర్ కామెడీ జోనర్ సినిమాలకి ఓ రకంగా కాలం చెల్లిపోయింది అనే చెప్పాలి. అయినప్పటికీ కోన వెంకట్ దర్శకత్వ పర్యవేక్షణలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi) రూపొందింది. 2014 లో వచ్చిన ‘గీతాంజలి’ అనే హర్రర్ కామెడీ సినిమాకి ఇది సీక్వెల్. అంజలి (Anjali) ప్రధాన పాత్రలో రూపొందిన ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది కానీ కంటెంట్ పరంగా గుర్తుండే సినిమా ఏమీ కాదు. అయినా దానికి సీక్వెల్ చేశారు కోన వెంకట్ (Kona Venkat) అండ్ టీం. సరే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: ‘గీతాంజలి’ కథ శ్రీను (శ్రీనివాస రెడ్డి) (Srinivasa Reddy) డైరెక్టర్ అవ్వడంతో ముగుస్తుంది. కానీ ఈ కథ అతను డైరెక్టర్ అయ్యి ఒక హిట్టు కొట్టాక వెంటనే మూడు ఫ్లాపులు ఇవ్వడంతో మొదలవుతుంది. అతను ఫ్లాపుల్లో ఉండటంతో అతనితో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రారు.దీంతో అతను తన ఫ్రెండ్ అయాన్ (‘స్వామిరారా’ సత్య)ని (Satya) మోసం చేసి డబ్బు తీసుకుంటాడు. అంతేకాదు తన నెక్స్ట్ సినిమాలో ‘నువ్వే హీరో’ అని మాయ మాటలు చెప్పి అతన్ని ములంచెట్టు ఎక్కిస్తాడు.అతని మాటలు నమ్మి హైదరాబాద్ కి వచ్చేసిన సత్య అసలు నిజం తెలుసుకుంటాడు.
దీంతో రైటర్స్ ఆరుద్ర, ఆత్రేయ (‘సత్యం’ రాజేష్ (Satyam Rajesh), ‘షకలక’ శంకర్ (Shakalaka Shankar))తో పాటు శ్రీను, అయాన్ తమ ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతారు. అలాంటి టైంలో శ్రీనుకి ఓ సినిమా ఛాన్స్ వస్తుంది. అది ఎలా? సినిమా తీసే ప్రాసెస్ లో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? మధ్యలో అంజలి(అంజలి) పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: అంజలి ఓ కాఫీ షాప్ అమ్మాయిగా ఇందులో కనిపిస్తుంది. ఆమె కొత్తగా ఈ సినిమాలో నటించింది అంటూ ఏమీ లేదు. కామెడీ చేసేంత స్కోప్ కూడా మిగిలిన కమెడియన్స్ ఇచ్చింది లేదు. తన స్టైల్లో జస్ట్ అలా కానిచ్చేసింది అంతే. శ్రీనివాస రెడ్డి పాత్ర మొదటి భాగంలో ఎలా ఉంటుందో అలాగే రొటీన్ గా అనిపిస్తుంది. ‘సత్యం’ రాజేష్, ‘షకలక’ శంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) , ముక్కు అవినాష్ ..ల నటన జస్ట్ ఓకే అనిపిస్తుంది.
బొమ్మాలి రవిశంకర్ (K. Ravi Shankar) పాత్ర ఈ మధ్య వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ లో అతను చేసిన పాత్రలానే ఉంది. ప్రియా వంటి మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అలీ (Ali) పాత్ర గెస్ట్ రోల్ మాదిరిగానే ఉంది.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి సినిమాకే రెగ్యులర్ రొటీన్ కథని అతను ఎంపిక చేసుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమాకి అతని పేరు డైరెక్టర్ గా వేశారు తప్ప.. మొత్తం డైరెక్ట్ చేసింది కోన వెంకటే అనే డౌట్ ఎవ్వరికీ రాకుండా అయితే ఉండదు. అంత రొటీన్ గా ఈ సినిమా కథనం ఉంటుంది. సీక్వెల్ తీసేప్పుడు కథనం కొత్తగా ఉండాలి. మొదటి భాగం చూస్తేనే కానీ అర్థం కాని విధంగా స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకోవాలి.
కానీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చూస్తున్నంత సేపు ఓ కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ ఏమీ కలగదు. పైగా తెరపై రాబోయే నెక్స్ట్ సీన్లు కూడా ముందే ఆడియన్స్ గెస్ చేసే విధంగా స్క్రీన్ ప్లే సాగుతూ ఉంటుంది. కామెడీ, స్క్రీన్ ప్లే , హర్రర్ ఎలిమెంట్స్ .. ఏ రకంగానూ కూడా కొత్తదనం లేని సినిమా ఇది. సెకండ్ హాఫ్ అయితే కాస్త టైం పాస్ చేసే విధంగానే ఉంటుంది. అంతకు మించిన ప్లస్ పాయింట్లు అయితే ఈ సినిమాకి లేవు.
విశ్లేషణ: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ కానీ భయపెట్టలేదు.. పడి పడి నవ్వించింది కూడా లేదు. ధియేటర్ కి వెళ్లి చూసేంత రేంజ్లో అయితే ఈ సినిమా లేదు కానీ.. ఓటీటీకి లేదంటే యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చాక సెకండ్ హాఫ్ లోని కామెడీ సీన్లు కోసం ట్రై చేయొచ్చు.
రేటింగ్ : 2/5