‘బిగ్ బ్రదర్’ తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్న దర్శకుడు

ఇంట గెలిచి రచ్చ గెలిచే దర్శకుల సంఖ్య సహజంగానే చాలా తక్కువుంటుంది. రచ్చ గెలిచి మళ్ళీ ఇంట “రచ్చ” చేసేవారి సంఖ్య మరీ అరుదుగా ఉంటుంది. ఆ అరుదైన జాబితాలోనూ స్థానం సంపాదించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు!!

సుమారు నాలుగు దశాబ్దాల క్రితం (1986లో) దర్శకత్వశాఖలో అరంగేట్రం చేసి, పలువురు దిగ్గజాల దగ్గర శిష్యరికం చేసి, దర్శకత్వంలోని మెళకువలన్నీ ఆకళింపు చేసుకున్న గోసంగి… దర్శకుడిగా తన పరిచయ చిత్రం “భవాని”తో సంచలన విజయం సొంతం చేసుకున్నారు. తర్వాత “శివుడు, మనమిద్దరం” చిత్రాలతోనూ మెప్పించిన సుబ్బారావు… అనుకోకుండా భోజపురి చిత్ర రంగప్రవేశం చేసి, అక్కడి పరిశ్రమలో సంచలనానికి పర్యాయపదంగా మారారు. ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా “అయిదు హ్యాట్రిక్”లు (15 సినిమాలు) సాధించి… తెలుగువారంతా గర్వంగా రొమ్ములు విరుచుకునేలా “రాజమౌళి ఆఫ్ భోజపురి”గా నీరాజనాలు అందుకుంటున్నారు!!

గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో భోజపురిలో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 15 చిత్రాలలో… మూవీ మొఘల్ స్వర్గీయ రామానాయుడు నిర్మించిన చిత్రంతోపాటు… లెజండరీ ప్రొడ్యూసర్ సి.అశ్వినీదత్ సోదరుడు సాయిబాబా నిర్మించిన రెండు చిత్రాలు కూడా ఉండడం గమనార్హం!!

చాలా విరామం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ… గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించిన “బిగ్ బ్రదర్” ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. “లైట్ హౌస్ సినీ మ్యాజిక్” పతాకంపై శంకర్ రావు కంఠంనేని – ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత. గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించింది!!

ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ… “అనుకోకుండా భోజపురిలో ఎంట్రీ ఇచ్చిన నాపై అక్కడి పరిశ్రమ… అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలతో కట్టిపడేసి “దత్తత” తీసేసుకుంది. తెలుగు రీ-ఎంట్రీ కోసం ఎప్పటికప్పుడు సన్నాహాలు చేసుకున్నా… భోజపురిలో ఫుల్ బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. మిత్రుడు ఘంటా శ్రీనివాసరావు ఒత్తిడి వల్ల… ఎట్టకేలకు తీరిక చేసుకుని “బిగ్ బ్రదర్”తో దర్శకుడిగా నాకు జన్మ ఇచ్చిన కన్నతల్లి ఒడికి చేరుకుంటుండడం చాలా సంతోషంగా, ఎంతో ఉద్వేగంగా ఉంది. ఇకనుంచి నా సినీ జీవితం తెలుగులోనే” అంటున్నారు!!

ఇకపై వరుసగా తెలుగులో చిత్రాలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న గోసంగి… ఇప్పటికే రెండు సినిమాలకు సంతకాలు చేసి ఉండడం, ఆ రెండు ప్రాజెక్ట్స్ ప్రి-ప్రొడక్షన్ దశల్లో ఉండడం గమనార్హం. ఇప్పటికీ ఉరిమే ఉత్సాహంతో ఉరకలు వేస్తూ, తన టీమ్ ను ఉత్తేజితం చేసే గోసంగి సుబ్బారావు తన “గ్లామర్ రహస్యం” గురించి అడిగితే గట్టిగా నవ్వేశారు. అదే ప్రశ్న మరోసారి రెట్టించినప్పుడు… “కష్టాలను సుఖాలను ఒకేలా తీసుకోవడం, మనసులోకి ఎలాంటి కల్మషాలు చొరబడనీయకుండా నియమబద్ద జీవన విధానం పాటించడం, ఎవరినుంచైనా అనుచితంగా లబ్ది పొందాలనే యావ లేకపోవడం” తన గ్లామర్ సీక్రెట్స్ అని వివరించారు!!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus