‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత రానా హీరోగా తెలుగులో మరే చిత్రం రాలేదు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో చంద్రబాబు పాత్రను పోషించినప్పటికీ… ఆ చిత్రంలో రానా పూర్తి స్థాయి హీరో అయితే కాదు. ఇక పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ వచ్చాడు కానీ తెలుగులో రానా హీరోగా మరో చిత్రం చేయలేదు. దీంతో రానా ఎటువంటి చిత్రం చేస్తాడా అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో రానాతో ‘హిరణ్యకశిప’ అనే చిత్రం చేయబోతున్నట్టు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇది వరకే ప్రకటించాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘రుద్రమదేవి’ చిత్రం వచ్చింది.
అయితే చాలా గ్యాప్ తర్వాత.. ఇప్పుడు ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయని తాజా సమాచారం. దాదాపు 100 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుందట. ఈ కారణంగానే రానా తండ్రి సురేష్ బాబుతో పాటూ మరో ఇద్దరు ముగ్గురు బడా నిర్మాతలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కాబోతున్నారని సమాచారం. ఇక ఇదే క్రమంలో ఈ చిత్రంలోని నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయబోతున్నారట. ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం.