‘జన నాయగన్’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చాలా వార్తలు వినే ఉంటారు. చాలా విషయాలు కథలు కథలుగా గత కొన్నేళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నాం. మీరు కూడా చదువుతూనే ఉన్నారు. ఇందులో కొన్ని హ్యాపీ న్యూస్‌లు ఉంటే ఇంకొన్ని అన్‌హ్యాపీ న్యూస్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వచ్చి.. అన్నీ కలసివస్తే రాబోయే రెండు, మూడు వారాలు ఈ సినిమా గురించి హ్యాపీన్యూస్‌లే వినొచ్చు.
అయితే, ఈ సినిమా ఎలా మొదలైంది, దర్శకుడిగా హెచ్.వినోద్ ఎలా వచ్చారు అనే విషయాల్ని ఇటీవల ఆయనే చెప్పుకొచ్చారు. తనకంటే ముందు 15 మంది దర్శకులు విజయ్‌కి కథ వినిపించారని, తన తర్వాత మరో 10 మంది కథ చెప్పారని.. కానీ విజయ్ తన స్క్రిప్ట్ విని.. ఆలోచించారని వినోద్ తెలిపారు. ఈ కథ హెవీగా ఉంది… నువ్వు చెప్పేదంతా నాకు అర్థం కావట్లేదు. తప్పుగా అనుకోవద్దు అన్నారు. ఆ తర్వాత నాకు ఒక సినిమా నచ్చింది… దాన్ని నువ్వు రీమేక్ చేస్తావా అని వినోద్‌తో విజయ్ అడిగారట.
అయతే తనకు రీమేక్ చేయడం ఇష్టం లేదు. కానీ విజయ్‌తో సినిమా చేద్దామని పక్కాగా అనుకున్నాను. అందుకే రీమేక్ చేద్దాం అని ఫిక్సయ్యా. అయితే విజయ్‌న మళ్లీ కలిసినప్పుడు ‘రీమేక్ చేస్తానని చెప్పేశావుగా… ఇక ఇంకో కథ వినడం ఎందుకు రా కూర్చో అని అన్నారట విజయ్. అప్పుడు విజయ్ ‘భగవంత్ కేసరి’ (ఆ పేరు వినోద్ చెప్పలేదు) సినిమా గురించి చెప్పి తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఉన్న ఈ కథను తమిళ ప్రేక్షకులకు సెట్ అయ్యేలా మార్చమని చెప్పారట.
ఆ సమయంలో సినిమాలో విలన్ మోటివ్‌ని బలంగా మార్చాలనుకున్నాను. ఆ విషయం విజయ్‌తో చెబితే ‘అది నువ్వు చేసుకో… కానీ మాతృకలోని కీలకమైన అంశం కచ్చితంగా ఉండాలి అని చెప్పారట. అదే మహిళా సాధికారత. ఈ నేపథ్యానికి విజయ్ భావోద్వేగంగా కనెక్ట్ అవ్వడమే ‘జన నాయగన్’ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణమైంది అని చెప్పారు వినోద్. ఈ కథ ముందు విజయ్‌కి వినోద్ చెప్పిన కథలేంటి అనేగా మీ డౌట్. ఒక యాక్షన్ కథ, మరో కథ ‘తుపాకి 2’ లాంటిది.