ఆ విషయాన్ని బయట పెట్టిన హరీష్ శంకర్ ట్వీట్!

  • July 18, 2018 / 01:19 PM IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ హరీష్ శంకర్ కి మధ్య దూరం పెరిగిందని వార్తలు వినిపించాయి. మల్టీస్టారర్ మూవీ సినిమా విషయంలో ఇద్దరి మధ్య గొడవ రావడంతో విడిపోయారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అది రూమర్ కాదని, నిజమని ఈరోజు స్పష్టమయింది. దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ మూడు సినిమాలు చేశారు. “రామయ్య వస్తావయ్యా” ఫెయిల్ అయినప్పటికీ హరీష్ శంకర్ కి దిల్ రాజు ఛాన్స్ ఇచ్చారు. ఇద్దరి కాంబినేషన్లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌, దువ్వాడ జగన్నాథమ్‌ సినిమాలు వచ్చాయి. లాభాలను అందించాయి. మళ్ళీ ఈ కాంబోలో మల్టీస్టారర్ సినిమా ప్రారంభం కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే సినిమాల జాబితాను అధికారికంగా ప్రకటించారు.

రాజ్‌తరుణ్ హీరోగా తెరకెక్కిన “లవర్” సినిమా ఈ నెల 20 న విడుదల కాబోతోంది.  నితిన్ `శ్రీనివాస కల్యాణం` ఆగస్టు 9వ తేదీన, రామ్ `హలో గురు ప్రేమ కోసమే` అక్టోబర్ 18వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇక వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన వెంకటేష్‌, వరుణ్ `ఎఫ్‌2`, ఏప్రిల్ ఐదో తేదీన సూపర్‌స్టార్ మహేష్ బాబు 25వ సినిమా విడుదల కాబోతున్నట్టు దిల్ రాజు నిర్మాణ సంస్థ తెలిపింది. దీనిని రీట్వీట్ చేసిన హరీష్ శంకర్‌.. “ఈ జాబితా నుంచి నా సినిమా మిస్ అయింది. చాలా బాధగా ఉంది. కానీ, కొన్నిసార్లు తప్పవు. ఈ ఐదు సినిమాలు ఘనవిజయాలుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. దిల్ రాజు, హరీష్ శంకర్ విడిపోయినట్టు ఈ ట్వీట్ స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus