ఒక్కసారి సెలబ్రిటీ అనే గుర్తింపు లభించిందంటే.. పర్సనల్ లైఫ్ అనే విషయాన్ని మర్చిపోవాలి. సెలబ్రిటీలు దగ్గినా, తుమ్మినా వార్తలుగా మారిపోతున్న ఈరోజుల్లో సెలబ్రిటీలు కనబడితే వారితో సెల్ఫీలు దిగడానికి, కుదిరితో వాళ్ళని ఫోటోలు తీయడానికి జనాలు ఎగబడడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఈమధ్యకాలంలో ఈ సెల్ఫీ ఫోటోల పిచ్చి జనాలకి బాగా ఎక్కువైంది. మొన్నామధ్య బాలయ్య తనతో సెల్ఫీ దిగడానికి అత్యుత్సాహం చూపిన ఒక యువ అభిమాని ఫోన్ ను నెట్టడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో అనసూయ బిహేవియర్ కూడా వివాదాస్పదమైంది. ఓ కుర్రాడు (సుమారు ఏడెనిమిదేళ్ళుంటాయి) రోడ్డు మీద సడన్ గా అనసూయ కనిపించేసరికి తనదగ్గరున్న ముబైల్ ఫోన్ లో అనసూయ ఫోటోలు/వీడియోలు తీయడానికి ప్రయత్నించాడు.
అది గమనించిన అనసూయ వెంటనే ఆ కుర్రాడి ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయిందని ఆ కుర్రాడి తల్లి ఆరోపించింది. తమ ఫోన్ లాక్కొని బద్దలుకొట్టడంతోపాటు దుర్భాషలాడుతూ అనసూయ అక్కడ్నుంచి వెళ్లిపోయిందని ఆమె పేర్కొంది. ఈ విషయంలో క్లారిటీ కోసం అనసూయను సంప్రదించగా.. “నేను నిన్న సాయంత్రం మా అమ్మగారి ఇంటి దగ్గర వాకింగ్ చేస్తుండగా.. ఆ కుర్రాడు తన తల్లి వెనుక స్కూటీ మీద కూర్చుని నా వీడియో తీస్తున్నాడు. నేను వద్దని చెప్పినా వినకుండా వీడియో తీస్తూనే ఉన్నాడు. దాంతో నేను కాస్త కోపంగా వారించానంతే. అంతే తప్ప నేను ఆ ఫోన్ పగలగొట్టడం, ఆ కుర్రాడ్ని తిట్టడం అనేది జరగలేదు. నిజానికి నేను ఫోటోలు ఇవ్వడానికి ఎప్పుడూ ఇబ్బందిపడను, కానీ నిన్న ఫోటో దిగేందుకు నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే ఆ కుర్రాడు వీడియో తీస్తుంటే వద్దు అన్నానే తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. మరి ఆ కుర్రాడి తల్లి ఇలా ఫోన్ పగలగొట్టానని ఎందుకు చెబుతుందో నాకైతే తెలియదు” అని సమాధానమిచ్చారు.