మహానటిలో ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తున్నారు!

  • May 8, 2018 / 01:24 PM IST

మనందరి అభిమాన మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెలుగులో “మహానటి” అనే చిత్రం తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. బుధవారం ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో “సావిత్రి”గారి పాత్రలో కీర్తి సురేష్ నటించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే “మహానటి” సినిమాలో కీర్తి సురేష్ కాకుండా ఇంకా బోలెడుమంది సీనియర్ ఆర్టిస్టులు, దర్శకులు, యువ కథానాయకులు, కథానాయికలు ఉన్నారు. మరి వారు ఏ పాత్రలు పోషించారు? సినిమాలో, సావిత్రి జీవితంలో వారి ప్రాముఖ్యత ఏమిటి? అనేది తెలుసుకొందాం..!!

సావిత్రి – కీర్తి సురేష్“రైల్” అనే సినిమాలో అమ్మడి ఇన్నోసెన్స్ నచ్చి దర్శకుడు నాగఅశ్విన్ “మహానటి”లో టైటిల్ పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకొన్నాడు. మొదట్లో కాస్త సందేహపడినా స్టిల్స్ బయటకొచ్చాక అందరూ “అచ్చుగుడ్డినట్లు మహానటిలా ఉందే” అనడంతో దర్శకనిర్మాతలు ఊపిరిపీల్చుకొన్నారు. మరి పోస్టర్స్ వరకూ పర్లేదు కానీ.. నటిగా సావిత్రి పాత్రలో అమ్మడు ఎంతవరకూ జీవించింది అనేది తెలియాలంటే కొన్ని కొన్ని గంటలు ఆగాల్సిందే.

జెమిని గణేషన్ – దుల్కర్ సాల్మన్సావిత్రి జీవితంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఆమె భర్త జెమిని గణేషన్. సావిత్రినే 16 ఏళ్లకే పెళ్లాడి ఆమె ఎదుగుదలకు కారకుడయ్యాడు. అలాగే.. సావిత్రి మానసికంగా క్రుంగిపోవడానికి కూడా జెమిని గణేషన్ కారకుడని చెప్పుకొంటుంటారు. అంతటి కీలకపాత్ర అయినందునే ఈ పాత్రను దుల్కర్ చేత పోషింపజేశారు.

మధురవాణి – సమంతఈ పాత్రకి మహానటి జీవితంతో సంబంధం లేకపోయినప్పటికీ.. సినిమాలో అసలు “మహానటి” గురించి పరిశోధించే పాత్రికేయురాలిగా సమంత కనిపించనుంది. ఈమె పాత్ర ద్వారానే కథలో కీలకమైన మలుపు రానుందని, కేవలం ఆ ఒక్క సన్నివేశం నచ్చే సమంత ఈ సినిమాలో ముఖ్యభూమిక పోషించడానికి అంగీకరించిందని స్వయంగా సమంత ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పడం విశేషం. మరి ఈ కీలక సన్నివేశం ఏంటో చూడాలి.

విజయ్ ఆంటోనీ – విజయ్ దేవరకొండసమంత పోషించిన మధురవాణి పాత్రకు తోడు లాంటి విజయ్ ఆంటోనీ అనే ఫోటో జర్నలిస్ట్ గా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇతగాడి పాత్ర నవ్వులు జల్లు కురిపిస్తుందట. “అర్జున్ రెడ్డి” తర్వాత విజయ్ దేవరకొండ పూర్తిస్థాయిలో ప్రమోట్ చేస్తున్న ఇదే కావడం విశేషం.

ఎస్వీ రంగారావు – డా.మోహన్ బాబుతెలుగు సినిమా చరిత్రలో ఎన్టీయార్, ఏయన్నార్ లతో సమానమైన ప్రాధాన్యత కలిగిన నటుడు ఎస్వీ రంగారావు. సావిత్రి లేని “మాయాబజార్”ను ఎలా అయితే ఊహించుకోలేమో.. ఎస్వీ రంగారావు గారు లేకపోవడాన్నీ అదే తరహాలో ఊహించలేము. అందుకే.. “మహానటి” సావిత్రి జీవితంలో కీలకమైన “మాయాబజార్”ను రీక్రియేట్ చేయడంలో భాగంగా.. ఎస్వీ రంగారావు పాత్రను మోహన్ బాబు గారిచేత పోషింపజేశారు. మరి మన డైలాగ్ కింగ్ మోహన్ బాబుగారు ఆ పాత్రను ఎస్థాయిలో రంజింపజేశారో చూడాలి.

కెవి.చౌదరి – రాజేంద్రప్రసాద్సావిత్రి కెరీర్ ను చక్కదిద్దడంలో కీలకపాత్ర పోషించిన ఆమె పెదనాన్న కెవి.చౌదరిగా రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్ర పోషించారు.

దుర్గమాంబ – భానుప్రియసావిత్రి మేనత్తగా భానుప్రియ ఈ చిత్రంలో నటించారు. సావిత్రి సినిమా అండ్ పర్సనల్ కెరీర్ గ్రాఫ్ లో దుర్గామాంబ పాత్ర చాలా కీలకమైనది.

ఆలూరి చక్రపాణి – ప్రకాష్ రాజ్సావిత్రి జీవితంలో కీలకఘట్టమైన “మాయా బజార్” రూపకల్పనలో అల్లూరి చక్రపాణిగారిది కీలకపాత్ర. అందుకే “మహానటి”లోని “మాయాబజార్” సీక్వెన్స్ లో చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ మెరవనున్నారు.

కె.వి.రెడ్డి – క్రిష్“మాయాబజార్” సృష్టికర్త కె.వి.రెడ్డిగా మరో దర్శకుడు క్రిష్ కీలకపాత్ర పోషించడం విశేషం. మేకప్ వేశాక అచ్చుగుడ్డినట్లు క్రిష్ మన కె.వి.రెడ్డిగారిలాగే ఉన్నారని అందరూ ప్రశంసించడం విశేషం.

సింగీతం శ్రీనివాసరావు – తరుణ్ భాస్కర్“మాయాబజార్” సినిమాకి కె.వి.రెడ్డిగారు దర్శకుడైతే సింగీతం శ్రీనివాసరావుగారు అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడం విశేషం. ఆయన పాత్రలో “పెళ్ళిచూపులు” ఫేమ్ తరుణ్ భాస్కర్ కనిపించనుండడం గమనార్హం.

అలమేలు – మాళవికా నాయర్సావిత్రిగారు జెమిని గణేషన్ ను మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. మొదటి ఇద్దరు భార్యలు ఎవరు అనేది చాలా మందికి తెలియదు. అయితే.. శివాజీ గణేషన్ మొదటి భార్య అయిన అలమేలుగా “ఎవడే సుబ్రమణ్యం” ఫేమ్ మాళవికా నాయర్ నటిస్తోంది.

సుశీల – షాలిని పాండేసావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల పాత్రలో “అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే నటిస్తోంది. తొలుత ఈమె జమున పాత్ర పోషిస్తుందని టాక్ వచ్చినప్పటికీ.. చిత్రబృందం విడుదల చేసిన ప్రోమోతో క్లారిటీ వచ్చింది.

సుభద్రమ్మ – దివ్యవాణిమహానటి సావిత్రికి జన్మనిచ్చిన మహాతల్లి సుభద్రమ్మగా సీనియర్ నటీమణి దివ్యవాణి నటిస్తోంది. ఇదే దివ్యవాణిని “పెళ్లిపుస్తకం” టైమ్ లో జూనియర్ సావిత్రి అని పిలిచేవారు అప్పటి ఇండస్ట్రీ జనాలు.

నిస్సంకరరావు – తనికెళ్లభరణిపోషించే పాత్ర ఏదైనా అందులో వంద శాతం పర్ఫెక్షన్ చూపే ఏకైక నటుడు తనికెళ్లభరణి. ఆయన ఈ చిత్రంలో సావిత్రి తండ్రి నిస్సంకరరావుగా నటించారు.

అక్కినేని నాగేశ్వర్రావు – అక్కినేని నాగచైతన్యసినిమా మొదలైనప్పట్నుంచి సావిత్రిగా కీర్తి సురేష్ సెలక్షన్ కంప్లీట్ అయిపోవడంతో అందరి దృష్టీ ఒకే విషయంవైపు కేంద్రీకృతమై ఉంది. అదేంటంటే.. ఏయన్నార్, ఎన్టీయార్ లుగా ఎవరు నటించనున్నారని. లక్కీగా నాగచైతన్య ఒప్పుకోవడంతో ఏయన్నార్ పాత్రలో చైతూ కనిపించనున్నాడు. కానీ.. ఎన్టీయార్ గా నటించేందుకు జూనియర్ ఎన్టీయార్ సాహసం చేయలేకపోవడం గమనార్హం.

ఎల్.వి.ప్రసాద్ – శ్రీనివాస్ అవసరాలతెలుగు సినిమాకి దార్శనికుడిగా పేర్కొనదగ్గ వ్యక్తి ఎల్.వి.ప్రసాద్. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ స్థాయి ఆయన సొంతం. అంతటి ప్రముఖుడి పాత్రలో మన అవసరాల శ్రీనివాస్ నటించడం విశేషం.

గుమ్మడి వెంకటేశ్వర్రావు – నరేష్సీనియర్ మోస్ట్ యాక్టర్ అయిన నరేష్.. సీనియర్ మోస్ట్ హీరో కమ్ ఆర్టిస్ట్ గుమ్మడి వెంకటేశ్వర్రావు పాత్ర పోషించడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఆదుర్తి సుబ్బారావు – సందీప్ రెడ్డి వంగా“అర్జున్ రెడ్డి”తో దర్శకుడిగా విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న సందీప్ రెడ్డి వంగా “మహానటి”లో ఆదుర్తి సుబ్బారావుగా కనిపించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus