యంగ్ హీరో నితిన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెడుతూ.. హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకుపోతున్నాడు. గతేడాది ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’, ‘చెక్’, ‘అంధాదూన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేసిన ‘చెక్’ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ కానుంది. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.
ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ చెస్ గేమ్ టాలెంట్ తో తన లక్ష్యాన్ని ఎలా చేరుకోగలిగాడనే పాయింట్ తో సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ లు సినిమాపై హైప్ ని పెంచేశాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నితిన్ ‘చెక్’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రితం ఓ డిఫరెంట్ సినిమా చేద్దామని అనుకున్నప్పుడు చంద్రశేఖర్ గారు తనకు ‘చెక్’ కథను వినిపించారని..
కథ విన్న ఇరవై నిమిషాల్లోనే ఓకే చెప్పేశానని నితిన్ చెప్పుకొచ్చాడు. తన కెరీర్ లో ఇలాంటి డిఫరెంట్ కథతో సినిమా చేయడం ఇదే తొలిసారి అని.. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. తన గత సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. ఈ సినిమా మరో ఎత్తు అని చెప్పారు. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!