నా టాప్ 5 ఫిలిమ్స్ లిస్ట్ లో “గరుడ వేగ” ఉంటుంది : రాజశేఖర్

  • July 8, 2020 / 12:03 PM IST

“నాతో సినిమాలు చేయడానికి డైరెక్టర్స్ ముందుకు రాలేకపోతున్న తరుణంలో ప్రవీణ్ సత్తారు నాకోసమే ఒక కథ రాసుకురావడమే కాక.. నన్ను నమ్ముకొని నిర్మాతలను ఒప్పించి మరీ 25 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టించాడు. నేనిక హీరోగా పనికిరాను అని చాలా మంది ఫిక్స్ అయిపోవడమే కాక నాకు విలన్ – క్యారెక్టర్ రోల్స్ ఆఫర్ చేస్తున్న తరుణంలో నేను హీరోగా నటించిన ఒక సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం అనేది నాకు ప్రాణం లేచొచ్చినట్లైంది” అంటూ ఎమోషనల్ అయిపోయారు హీరో రాజశేఖర్. ఆయన కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన “గరుడ వేగ” ఈ శుక్రవారం (నవంబర్ 3) విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారాయన.

నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిమ్..
హీరోగా ఇక నా కెరీర్ ఎండ్ అయిపోయిందని నేనే మానసికంగా సిద్ధమవుతున్న తరుణంలో, ప్రొడ్యూసర్లు నాతో 3 నుంచి 5 కోట్ల రూపాయల బడ్జెట్ చిత్రాలు కూడా తీయడానికి ముందుకు రాలేకపోతున్నప్పుడు ప్రవీణ్ సత్తారు నేను నటించిన “మగాడు” సినిమా చూసి.. ఆ సినిమాలో నా నటన చూసి ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడో తన మొదటి సినిమాగా తీయాలనుకొన్న కథను ఇప్పుడు నాతో తీయడానికి ముందుకొచ్చాడంటే.. అతనికి నేను జీవితాంతం ఋణపడి ఉంటాను. అలాగే మా ప్రొడ్యూసర్ కూడా తొలుత 7 నుంచి 8 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఓ చిత్రాన్ని తీద్దామనుకొని నిర్మాణ రంగంలోకి దిగి.. కేవలం కథను నమ్మి 25 కోట్లు ఖర్చు చేశారు. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన భారీ చిత్రం “గరుడ వేగ”.

చాలా తప్పులు చేశాను..
హీరోగా నాకు హిట్ వచ్చి చాలా ఏళ్లయిపోయింది. అందుకు పూర్తి బాధ్యుడ్ని నేనే. నా ఇమేజ్ కు తగ్గ స్క్రిప్త్స్ సెలక్ట్ చేసుకోకపోవడం ఏదో తమిళంలో ఆడింది కదా అని “సూదుకవ్వం” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాను, అది ఫ్లాపయ్యింది. అయితే.. నేనేప్పుడూ నా పరాజయాల విషయంలో బాధపడలేదు. జస్ట్ కొత్త విషయాలను నేర్చుకొన్నాను.

మొదట్లో భయపడ్డాను కానీ..
ప్రవీణ్ సత్తారు కథ చెప్పడం, అందర్నీ ఒప్పించడం బానే ఉంది కానీ.. ఇంత భారీ కథను ఎగ్జిక్యూట్ చేయగలాడా అనేది పెద్ద ప్రశ్న నాకు. షూటింగ్ మొదలవ్వక ముందు చాలా డౌట్ పడ్డాను. ఎప్పుడైతే మొదటిరోజు అతడు షూటింగ్ స్పాట్ లో ఆర్టిస్ట్స్ ని మేనేజ్ చేసే తీరు చూశానో నా అనుమానాలన్నీ తీరిపోయాయ్.

టీజర్ ప్రాణం పోసింది..
సినిమా ఎలా వస్తుందో మాకు తెలుసు కానీ.. జనాలు మా నమ్మకాన్ని ఆదరిస్తారా లేదా అనేది పెద్ద డౌట్. ఎప్పుడైతే టీజర్ విడుదలై అందర్నీ ఆకట్టుకొని అయిదు రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించిందో నేను షాక్ అయ్యాను. పర్లేదు నా సినిమా ఆడుతుంది అన్న నమ్మకం వచ్చింది.

ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్..
ఇప్పటివరకూ “గరుడ వేగ” సినిమా తెలుగులో రాలేదా అంటే చాలా వచ్చాయ్. అయితే.. “గరుడ వేగ” చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ట్రీట్ చేసిన విధానం ఆడియన్స్ ను అలరిస్తుంది. ఒక థ్రిల్లర్ కు ఫ్యామిలీ ఎమోషన్స్ ను యాడ్ చేసి సహజంగా తెరకెక్కించిన ఘనత ప్రవీణ్ ది. సినిమా రిలీజయ్యాక ఒకవేళ సక్సెస్ అయితే.. ఆ క్రెడిట్ మొత్తం ప్రవీణ్ కే చెందుతుంది. నమ్మకంగా చెబుతున్నా.. “గరుడ వేగ” నా కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్ గా నిలవడమే కాదు.. తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus