సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం అనేది కొత్త విషయమేమీ కాదు. అయితే, ఇప్పుడు మేం చెప్పే విషయం.. అలా వెళ్లినప్పుడు వారు చేసిన ఆఖరి సినిమా. అవును.. లాస్ట్ సినిమానే. సౌత్‌లో సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఆఖరి సినిమా విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే రీమేక్. మన హీరోలు రీమేక్‌లు చేయడం కొత్త కాదు కానీ.. పాలిటిక్స్‌కి వెళ్లే ముందు చేసిన సినిమా మాత్రం రీమేకే.
రీసెంట్‌గా పాలిటిక్స్‌లోకి వెళ్లిన వారితో ఈ లెక్క మొదలుపెట్టాలంటే.. విజయ్ సినిమా సంగతి చూడాలి. సంక్రాంతి కానుకగా రానున్న ‘జననాయగన్’ విజయ్‌కి ఈ దఫా ఆఖరి సినిమా. తెలుగులో మంచి విజయం అందుకున్న ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఇది రీమేక్ అని సమాచారం. పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ముందు చేసిన సినిమా ‘అజ్ఞాత వాసి’. ఈ సినిమా రీమేక్ అంటే ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు. అయితే ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ సినిమాకు ఇది ఫ్రీమేక్ అని చెప్పొచ్చు. ఆ విషయంలో ఆ డైరెక్టరే అప్పట్లో గోల గోల చేశారు.
చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన చివరి చిత్రం ‘శంకర్ దాదా జిందాబాద్’. ఇది ‘లగేరహో మున్నా భాయ్’కి రీమేక్. ఇక రాజకీయాల్లోకి వెళ్లి సంచలనం సృష్టించిన దివంగత ఎన్టీఆర్‌కి ఆ దఫాలో ఆఖరి సినిమా ‘నా దేశం’. ఇది హిందీ సినిమా ‘లావారీస్’కి రీమేక్. ఇదంతా ఓకే కానీ.. రీమేకే ఎందుకు అని అంటే.. దీనికి రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి పొలిటికల్ టచ్ ఉన్న కథ అయి ఉండాలి, రెండోది వేగంగా సినిమా పూర్తి చేయాల్సిన అవసరం వచ్చి ఉండాలి. ఇలా రాజకీయాల్లోకి వెళ్లి స్టార్ హీరోలు చాలా వరకు విజయాలు సాధించారు. మరి విజయ్ ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.