‘ఉప్పెన’ సినిమా కోసం రెండు వేల మంది ఆడిషన్ చేసి కృతి శెట్టిని ఎంపిక చేశారని చాలా రోజుల క్రితం చదివి ఉంటారు. సినిమా రిలీజ్‌కు ముందు మన సైట్లోనే చదివి ఉండొచ్చు. అయితే అంత పెద్ద ఆడిషన్లో కృతి ఓకే అయ్యింది అంటే… ఎంత పెద్ద టెస్ట్ పెట్టారో, ఎన్ని సీన్లు నటించమన్నారో అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది కదా. కచ్చితంగా మీకొచ్చిన డౌట్ చాలా గొప్పదే. అయితే దానికి కృతి చెప్పిన సమాధానం వింటే అవునా? నిజమా అని అవాక్కవుతారు.
కృతి శెట్టి ‘ఉప్పెన’కి ముందు కొన్ని యాడ్స్‌లో నటించింది. ‘సూపర్ 30’ సినిమాలో చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది కూడా. ‘ఉప్పెన’ హీరోయిన్ను వెతుకుతున్నప్పుడు ‘పూరీ కనెక్ట్స్’ ఏజెన్సీ ద్వారా దర్శకుడు బుచ్చిబాబు ఆమె ఫొటోలు చూసి ఆడిషన్స్ కోసం హైదరాబాద్ రమ్మన్నారట. దీంతో కృతి వచ్చింది ఆడిషన్‌కు సిద్ధమైంది. అప్పటికే కొంతమందిని ఆడిషన్ చేశారని కృతి తెలుసుకుందట. అయితే లోపలకు వెళ్లాక వాళ్లు అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యిందట.
ఆడిషన్ సమయంలో బుచ్చిబాబు సన్నివేశం చెప్పి నటించమని అడగలేదట. నుదుట బొట్టు పెట్టుకోమన్నారట. ఆ తర్వాత అటూ ఇటూ నడవమని చెప్పారట. వాళ్లు చెప్పినట్లే చేసిన కాసేపటి తర్వాత నువ్వు సెలక్ట్ అయ్యావని చెప్పి పంపించేశారట. అంటే కృతి నటనను కాకుండా స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందో చూసి ఓకే చేశారన్నమాట. అంతటి పేరు తెచ్చిన పాత్ర కృతికి ఇంత సులభంగా దక్కింది అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఆమె కూడా అలానే ఆశ్చర్యపోయిందట.