Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ) తన కొత్త కథను హృతిక్ రోషన్‌కు వినిపించినట్టు సమాచారం వినిపిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా మంచి హాట్ టాపిక్‌గా మారింది.

Hrithik Roshan – Bobby

ప్రసిద్ధ రైటర్ కోన వెంకట్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సిద్ధం చేస్తున్న ఒక ప్రత్యేక కథా ఆలోచనను హృతిక్ రోషన్‌తో పంచుకున్నట్లు చెప్పారు. ఆ కాన్సెప్ట్ వినగానే హృతిక్ ఎంతో ఆసక్తి చూపించాడని, “మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి?” అని ఆశ్చర్యపోయినట్టుగా కూడా కోన వెల్లడించారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తాడు అని కూడా తెలియజేసారు. ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య సినిమా అవకాశంపై ఊహాగానాలు మరింత పెరిగాయి.

అయితే కథా లైన్ నచ్చడం ఒక విషయం అయితే, పూర్తి స్క్రిప్ట్‌తో హృతిక్‌ను పూర్తిగా మెప్పించడం మాత్రం పెద్ద సవాలే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. హృతిక్ రోషన్ స్క్రిప్ట్ ఎంపికలో చాలా కఠినంగా వ్యవహరిస్తాడనే పేరు ఇండస్ట్రీలో ఉంది. కథ, స్క్రీన్‌ప్లే, పాత్రల తీరు.. ఇలా ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని చెప్పుకుంటారు.

ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, దర్శకుడు బాబీ ఇప్పటివరకు ఎక్కువగా ప్రాంతీయ సినిమాలకే పరిమితమయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్ట్ చేయాలంటే కథ కూడా అదే స్థాయిలో ఉండాలి. అలాంటి స్క్రిప్ట్‌తో హృతిక్‌ను మెప్పించగలడా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.

మరి ఈ కాంబినేషన్ నిజంగా రూపుదిద్దుకుంటుందా? లేక ఇది కేవలం చర్చల వరకే పరిమితమవుతుందా? అనే ఆసక్తి మాత్రం ఇప్పుడు సినీ అభిమానుల్లో పెరుగుతోంది. చివరకు బాబీ పూర్తి స్క్రిప్ట్ వినిపించిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus