పవన్ కల్యాణ్ డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. హెవీ స్టెప్‌లు జోలికి వెళ్లకుండా, క్లాస్‌తో కూల్‌గా స్టెప్పులేస్తుంటాడు. అయితే ఈ మధ్య ఆయన సినిమాల్లో స్టెప్పులు తగ్గుతూ వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఎక్కడో చిన్న వెలితి అయితే ఉంది. దీనికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు హరీశ్ శంకర్. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు వచ్చాయి. అందులో తొలిపాట ‘దేఖ్ లేంగే సాలా..’ పాట ఇప్పటికీ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇంకా మారుమోగుతూనే ఉంది.
పాట బీట్, పవన్ డ్యాన్స్ ఆ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత పవన్ ఇలా డ్యాన్స్ వేశారు అని అభిమానులు మాట్లాడుకున్నారు. కొంతమంది అయితే ఆ పాటలో పవన్ కల్యాణ్ జుట్టు గురించి మాట్లాడుకుంటున్నారు. పవన్ డ్యాన్స్ వేసినప్పుడు జుట్టు ఎగరడం గమనించారు. దీని గురించి దర్శకుడు హరీశ్ శంకర్ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు తన డిమాండ్ల గురించి పవన్ కల్యాణ్ ఏమన్నాఉ అనేది కూడా చెప్పారు.
ఈ సినిమాలోని డ్యాన్స్‌లు అభిమానులకు నచ్చేలా ఉంటాయి. ఒక పాటకు పవన్ కల్యాణ్ సుమారు 350 మందితో కలసి డ్యాన్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో క్లాప్స్, విజిల్స్‌తో సెట్స్‌లో సందడే సందడి. ఆయన స్టెప్పులేశాక అందరూ చప్పట్ల మోత మోగిస్తే.. హరీశ్ మాత్రం ఓకే అవ్వలేదట. పవన్ దగ్గరకు వెళ్లి ‘వన్స్‌మోర్ సర్’ అని అడిగారట. ‘ఇంతమందికి నచ్చింది కదా.. వన్స్ మోర్ ఎందుకు?’ అని పవన్ అన్నారట. దానికి హరీశ్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారట.
సర్, పాటలో డ్యాన్స్ వేస్తున్నప్పడు మీ జుట్టు ఎగరలేదు, మీరు డ్యాన్స్ వేస్తున్నప్పుడు జుట్టు బౌన్స్ అవ్వాలి అని చెప్పారట. దానికి పవన్ కల్యాణ్ ‘నీకు డ్యాన్స్ కావాలి.. జుట్టు ఎగరాలి.. మామూలు డిమాండ్స్ కావు’ అని మళ్లీ స్టెప్ వేశారట. ఈ స్టెప్పులు పెద్ద తెరపై చూడాలంటే మార్చి 26 రావాల్సిందే. అప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వెండితెరపై విశ్వరూపం చూపించనున్నాడు.