150కి పైగా సినిమాలకి రచయితగా, డైలాగ్ రైటర్ గా పని చేయడంతోపాటు పలు సినిమాల్లో నటుడిగానూ మెప్పించిన ప్రఖ్యాత రచయిత ఎం.వి.ఎస్.హరనాధరావుగారు నేడు గుండెపోటు కారణంగా ఒంగోలులోని తన ఇంట్లో మృతిచెందారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. విజయశాంతి “ప్రతిఘటన”, చిరంజీవి “స్వయంకృషి” వంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన హరనాధరావుగారికి సినీపరిశ్రమలో మంచి పరిచయాలే ఉన్నాయి.
అలాగే.. సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ఆరంభించి అనంతరం “కలిసుందాం రా, రాజకుమారుడు” వంటి సూపర్ హిట్స్ తోపాటు లెక్కకుమిక్కిలి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన నటి మల్లిక కూడా నేడు మరణించారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మల్లిక అనారోగ్యం కారణంగా కోమాలోనే తుదిశ్వాస వీడినట్లు సమాచారం. ఈమె టీవీలోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఇలా ఒకేరోజు ఇద్దరు చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రాణాలు విడవడంతో వారికి సంబంధించిన వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎం.వి.ఎస్.హరనాధరావుగారు మరియు మల్లికగార్ల ఆత్మలకు శాంతి కలగాలని “ఫిల్మీఫోకస్” కోరుకొంటోంది.