2019 జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క రాజోలు తప్ప మరెక్కడా కూడా ‘జనసేన’ ప్రభావం చూపలేకపోయింది. ఇది పక్కన పెడితే ‘మా టార్గెట్ 2024’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. దీంతో ఎలాగు ఐదేళ్ళు సమయం ఉంది కాబట్టి తిరిగి పవన్ సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం.. ‘నాకు సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని.. ‘జనసేన’ పార్టీ అబివృద్దే లక్ష్యమంటూ’ చెప్పుకొస్తున్నారు. కానీ అభిమానుల నుండీ మాత్రం ఒత్తిడి ఎక్కువగానే ఉంది.
ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుండీ కూడా పవన్ ఓ సినిమా చేయాలంటూ కొందరు సినీ ప్రముఖులు ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ ఇచ్చిన విషయాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థలో ఒకరైన నవీన్ ఎర్నేని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ‘పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది. ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. గతంలో అనుకున్నాం.. కానీ కుదర్లేదు. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే మంచి కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తామంటూ నవీన్ చెప్పుకొచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన.. పరుచూరి గోపాల కృష్ణ కూడా పవన్ కళ్యాణ్ కు కొన్ని సూచనలు ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ సినిమాలకు దూరం కావడం సరైనది కాదు. పవన్ కళ్యాణ్ ఏడాదికి ఒక్కటయినా ప్రజలని ప్రభావితం చేసే చిత్రం చేయాలి. సినిమా వల్ల ప్రజలకు మరింత చేరువకావచ్చు. ఎన్టీఆర్ కేవలం మూడు నెలల్లోనే ప్రజలకు దగ్గరయ్యారు. అంతే కాదు ఇప్పుడు త్రివిక్రమ్, చిరంజీవి, అల్లు అరవింద్ వంటి వారు కూడా పవన్ ఓ సినిమా చేయాలని చెబుతున్నారట.. ఈ నేపథ్యంలో మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.