నందమూరి బాలకృష్ణ వందో సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఆ సినిమా ఫలితం, ఆ తర్వాత లెక్కలు ఇవన్నీ ఇప్పుడు అనవసరం కానీ.. ఆ సినిమా స్థానంలో రావాల్సిన సినిమాకు సీక్వెల్ ఇప్పుడు వస్తోందని తెలుసా? అవును త్వరలో విడుదల కానున్న ‘అఖండ 2: తాండవం’ గురించే ఇదంతా. ఈ సినిమా తొలి పార్టు ‘అఖండ’ గురించే ఇప్పుడు చెబుతున్నది. ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు.
తమ కాంబినేషన్‌లో 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమా నిజానికి 2017లోనే రావాల్సింది అని చెప్పారు బోయపాటి శ్రీను. ఎందుకంటే ఆ సినిమా బాలయ్యకు 100వ చిత్రం అవ్వాల్సిందట. దీని కోసం చర్చలు జరిగాయని, అయితే ఇంకో సినిమాతో బిజీగా ఉండటం వల్ల అప్పుడు ప్రాజెక్ట్ చేయలేకపోయామని బోయపాటి శ్రీను చెప్పారు. అప్పుడు బోయపాటి – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘సరైనోడు’ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా కోసమే బోయపాటి బిజీగా ఉన్నారు.
దీంతో ‘అఖండ’ సినిమా బాలయ్యకు 106వ సినిమా అయింది. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ బాలయ్యకు 110వ సినిమా. తొలి సినిమాతో సాధించిన వసూళ్లు, విజయం కంటే రెండింతలు విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. బాలయ్య – బోయపాటి కాంబోలో ఇప్పటికే హ్యాట్రిక్ సినిమాలు వచ్చాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ అంటూ వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ సినిమా కూడా విజయం అందుకుంటే రెండో హ్యాట్రిక్ స్టార్ట్ చేసినట్లే.
ఇప్పటికే వచ్చిన సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. హైందవ ధర్మం గురించి, దేశ రక్షణ గురించి సినిమాలో చర్చించిన నేపథ్యంలో సినిమాకు పాన్ ఇండియా కలరింగ్ ఇచ్చినట్లు అయింది. మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాలంటే డిసెంబరు 4 రాత్రి వరకు ఆగాల్సిందే. ఆ రోజే స్పెషల్ ప్రీమియర్లు ఉన్నాయి మరి.