ఓ సినిమా అయిపోయాక మరో సినిమా వెంటనే మొదలెట్టేయాలి. లేదంటే వెంటనే ప్రకటించేయాలి. లేదంటే ఆ సినిమా ఓకే అయ్యింది, ఈ డైరక్టర్ కథ చెప్పారు, ఆ రీమేక్ చూశారట అంటూ రకరకాల పుకార్లు, వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో తొలి సినిమాతో మంచి విజయం సాధించిన హీరోలకు అయితే ఈ పరిస్థితి ఇంకా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్. అయితే వైష్ణవ్ది మూడో సినిమా కోసం. ఎందుకంటే క్రిష్ డైరక్షన్లో రెండో సినిమా ఇప్పటికే చేసేశాడు కాబట్టి.
‘ఉప్పెన’ విడుదలైన తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ప్రకటన ఇంకా జరగలేదు. మరోవైపు ‘కొండపొలం’( క్రిష్ సినిమా వర్కింగ్ టైటిట్) విషయమూ తేలలేదు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఆ సినిమా ఎప్పుడు వస్తుందనేది తెలియాలి. క్రిస్ ‘హరి హర వీరమల్లు’ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో ‘కొండపొలం’ గురించి నో ఇన్ఫో. దీంతో మూడో సినిమా విషయాలే ఇప్పుడు టాపిక్. మొన్నటివరకు ‘జాతిరత్నాలు’ అనుదీప్ డైరక్షన్లో ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి.
ఇప్పుడు ఓ తమిళ దర్శకుడితో వైష్ణవ్ మూడో సినిమా అని అంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ తెరకెక్కించిన గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ నటిస్తాడని తాజాగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఇందులో కథానాయిక ఎంపిక కూడా అయిపోయిందని అంటున్నారు. ‘పూరి’ల సినిమా ‘రొమాంటిక్’తో టాలీవుడ్‌కి పరిచయమవుతున్న కేతిక శర్మను వైష్ణవ్ సినిమా కోసం అనుకుంటున్నారట. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. వచ్చే నెలలో సినిమా మొదలుపెడతారట.