ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ – మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు ఎన్‌బీకే 111 అంటూ చలామణి అయిన ఈ సినిమాకు రూమర్లకు తగ్గట్టుగా ‘దాదా’ అని పేరే పెట్టారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌న తొలుత ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ అనౌన్స్ చేశారు. అదేంటి నిర్మాణ సంస్థ చెప్పాలి కదా అనుకుంటున్నారా? ఏమో మరి నిన్న తొలుత ఎక్స్‌లో పోస్ట్ చేసింది తమనే. ఇక అసలు విషయానికొస్తే..
ఈ సినిమా టైటిల్ షార్ట్‌గా అదిరిపోయింది. సినిమాలో బాలయ్య దాదాగా కనిపిస్తాడు అని చెప్పకనే చెప్పారు. గ్లింప్స్‌లో డైలాగ్‌లు, యాక్షన్ అంతా అలానే ఉన్నాయి. ‘‘దేఖో షేర్ ఆగయా..’’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ గ్లింప్స్.. ‘‘నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు.. వేలికి ట్రిగ్గరు ఉంటే సరిపోదు. బుల్లెట్స్‌కి బలుపుండాలి. గన్స్‌కి గట్స్ ఉండాలి’’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌తో ముగిసింది. ఇక ఈ సినిమాను డిసెంబరు 24న థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఇదంతా నార్మల్ సమాచారమే. ఇది కాకుండా సినిమా గ్లింప్స్‌లో మరో రెండు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకటి ‘అగ్గి పెట్టెందా?’ అనే డైలాగ్.. ఇంకొకటి ‘దాదాహుమే..’ అనే పాట. ఈ రెండూ గతంలో సినిమాల్లో వినిపించిన డైలాగ్ ‘అగ్గి పెట్టుందా?’. ప్రముఖ కథానాయకుడు, దివంగత కృష్ణ నటించిన ‘జమదగ్ని’ సినిమాలో మోస్ట్ లైక్డ్ డైలాగ్ ఇది. ఆ డైలాగ్ పెట్టాలని అనుకున్నారో.. లేక నార్మల్‌గా పెట్టారో కానీ ఇందులోనూ ‘అగ్గి పెట్టె ఉందా?’ అని పెట్టారు.
ఇక బాలకృష్ణ నడుస్తూ వచ్చిన ఓ షాట్ కోసం ‘దాదాహూమే..’ అనే పాట వినిపిస్తుంది. ఈ పాట వింటుంటే కల్ట్ క్లాసిక్ సినిమా ‘ఖల్ నాయక్’ సినిమాలోని ‘నాయక్ నహీ ఖల్ నాయక్ హూ మే..’ పాట వినిపిస్తోంది. దీంతో తమన్‌ని మరోసారి ట్రోల్ చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు పాత పాటల్ని వాడుకుంటారు అని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ‘కొరియన్ కనరాజు’ సమయంలోనూ ఈ విమర్శలు వచ్చాయి.