‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలు చూసిన ప్రతిసారీ విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఒక సినిమా వస్తే బాగుణ్ణు అని మూవీ లవర్స్ బలంగా కోరుకున్నారు. ఈ కాంబోలో సినిమా వస్తుందంటే.. ఎంటర్టైన్మెంట్ కి ఢోకా ఉండదు అనేది వారి నమ్మకం కావచ్చు. వెంకటేష్ కెరీర్ ప్రతిష్టాత్మక 50వ సినిమా అయినటువంటి ‘వాసు’ కి కూడా త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశారు.
అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రతిస్తాత్మక 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా.. అందులో వెంకటేష్ చిన్న క్యామియో చేయడం జరిగింది. ఫైనల్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మూవీ రాబోతోంది. అదే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ (AK 47 అనేది సబ్ టైటిల్)(Aadarsha Kutumbam AK 47). అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది ఈ క్రేజీ మూవీ. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నాగవంశీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ‘ఆదర్శ కుటుంబం’ కథ చుట్టూ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇటీవల అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బ్లాస్ట్’ (తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’) పేరుతో రిలీజ్ అయ్యింది. తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా బాగానే ఆడింది. తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కథకి చాలా వరకు ‘ఆదర్శ కుటుంబం’ కథ దగ్గరగా ఉంటుందట. విచిత్రం ఏంటంటే.. ‘బ్లాస్ట్ జోన్’ చిత్రాన్ని తెలుగులో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ద్వారా నాగవంశీనే రిలీజ్ చేయడం.
ఈ రెండు సినిమాల కథల మధ్య ఉన్న పోలికలను గమనించిన నాగవంశీ, ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా చూసుకోవాలని భావించారట.దీంతో ఈ విషయాన్ని ఆయన త్రివిక్రమ్ కు తెలియజేశారట. విషయం తెలుసుకున్న వెంటనే త్రివిక్రమ్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్టు వినికిడి. కథనం కనుక ఇంట్రెస్టింగ్ గా ఉంటే.. ఒక్కటే కథ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. గతంలో ఎన్టీఆర్ ‘టెంపర్’, కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాలు ఒక్కటే కథతో రూపొందాయి. దాదాపు ఒక్కే టైమ్లో రిలీజ్ అయినప్పటికీ 2 సినిమాలు విజయం సాధించాయి.