ప్రశ్నించొచ్చు కానీ.. సమాజానికి ఇబ్బంది కలిగేలా ప్రశ్నించకూడదు అని అంటుంటారు. ఇలా చేసినవారి మీద కేసులు పడతాయి, అదే సినిమా వాళ్లయితే వారి మీద నిషేధం కూడా విధిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పనే చేశారు అంటూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మీద నిషేధం విధించాలి అంటూ కొన్ని వర్గాలు టాలీవుడ్‌లో చర్చ మొదలుపెట్టాయి. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టుల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ చేసిన/ చేస్తున్న కామెంట్స్ దృష్ట్యా, గతంలో చేసిన కొన్ని కామెంట్లు కలిపి ఇప్పుడు నిషేధం విధించాలి అనే వాదనను తీసుకొచ్చారు.
ప్రకాశ్ రాజ్ ఇప్పుడు దేశద్రోహం కేసులు ఎదుర్కొంటున్న వారితో కలసి కుట్రలు పన్నుతున్నారు అంటూ కొత్త ఆరోపణలు కూడా యాడ్ అవుతున్నాయి. సినిమాల్లో పేరు తెచ్చుకుని నిజజీవితంలో వరుసగా హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు అని కొంతమంది వాదన. ఇలాంటి వారిని ఇండస్ట్రీలో ఉపేక్షించకూడదని సీనియర్ నటుడు శివకృష్ణ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చను మరింత పెంచింది.
అంతేకాదు గతంలోనే కొన్ని కారణాల వల్ల ప్రకాశ్ రాజ్‌పై పరిశ్రమలో నిషేధం విధించామని, అప్పట్లో ఆయన రిక్వెస్ట్ చేస్తే క్షమించి వదిలేశామని శివకృష్ణ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తన మితిమీరిపోయిందని, హిందూ మతంపై వ్యాఖ్యలు చేసేవారికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అక్కడితో ఆగకుండా ప్రకాశ్ రాజ్ లాంటి వైరస్‌ను ఇండస్ట్రీలో ఉంచితే టాలీవుడ్ మొత్తం బ్లేమ్ అవుతుందని కూడా అన్నారు.
అయితే, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ మీద నిషేధం విధిస్తే తెలుగు సినిమాలే కాదు, ఇండియన్ సినిమాలు కూడా ఇబ్బందులు పడతాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో ఆయన వరుస సినిమాలు చేస్తున్నరు. ఇందులో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. మరి వారందరూ బ్యాన్ విషయంలో ఏమంటారో చూడాలి. అయితే ఏ ఒక్కరో, ఇద్దరో అంటే పరిశ్రమ నుండి ఆయన బ్యాన్ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే సమాజం గురించి టాలీవుడ్ నటులు (రాజకీయ పార్టీల సమీపంగా ఉండేవారు) చాలా కామెంట్లు చేశారు.