దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయాలి. ఈ మాట చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. వీలు చిక్కినప్పుడల్లా దిల్ రాజు కూడా ఈ మాట అంటూ ఉంటారు. అయితే సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు. దిల్ రాజు దగ్గర విజయ్ దేవరకొండకి సరిపడే కథ లేదనీ కాదు, చేయదగ్గర దర్శకుడూ లేడని కాదు. కానీ సినిమా కుదరడం లేదంతే. అయితే ఇప్పుడు విజయ్ సినిమా తప్పక చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. ఆ సినిమాకు పవన్ కల్యాణ్ సినిమా చేయాల్సిన దర్శకుడు ఓకే అయ్యారు అంటున్నారు.
ముందుగా చెప్పినట్లు దిల్ రాజుకు ఓ హీరో ఓకే అయితే.. సినిమాలు చేయడానికి దర్శకులు రెడీగా ఉంటారు. అతని టీమ్‌లో అలాంటి వాళ్లు ఉన్నారు. ఈ క్రమంలో స్టార్ దర్శకుడు కావాలన్నా, కొత్త దర్శకుడు కావాలన్నా రెడీ. అలా విజయ్ దేవరకొండ కోసం ఓ స్టార్ దర్శకుడినే చూసే పనిలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. అతనే హరీశ్ శంకర్. పవన్ కల్యాణ్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను హరీశ్ శంకర్ చేయాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది.
దీంతో హరీశ్ కూడా వేరే హీరోతో సినిమా స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నారట. ఈ సమయంలో విజయ్ దేవరకొండతో సినిమా ఆలోచన దిల్ రాజుకు వచ్చిందని సమాచారం. ‘ఖుషి’ సినిమాను విజయ్.. దిల్ రాజుకే చేయాల్సింది. కానీ ఆ సినిమా నిర్మాత మారిపోయారు. దీంతో ఇప్పుడు హరీశ్‌తో విజయ్ కాంబినేషన్‌ను కుదర్చాలని దిల్ రాజు అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది.
అలా అని ‘భవదీయుడు భగత్ సింగ్’ కథను పూర్తిగా పక్కనపెట్టేయాలని హరీశ్ శంకర్ అనుకోవడం లేదట. పవన్ ఎప్పుడు ఉ.. అంటే అప్పుడు స్టార్ట్ చేసేద్దాం అని అంతా రెడీ చేసుకొని ఉన్నారట హరీశ్. చూడాలి మరి ఏ సినిమా మొదలవుతుందో, ఏమవుతుందో?