Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్ 3’ పంచాయితీలో మలుపు
- May 28, 2026 / 01:09 PM ISTByFilmy Focus Desk
ఇండియన్ సినిమాలో గత కొన్ని రోజులుగా చర్చలో ఉన్న పేర్లు ‘డాన్ 3’, రణ్‌వీర్ సింగ్. ఆ సినిమాలో ఈ హీరో నటిస్తానని చెప్పి తర్వాత విరమించుకోవడమే ఇప్పుడు చర్చకు కారణం. ఎందుకు తప్పుకున్నారు, ఏమైంది, తప్పుకున్నాక ఏం జరిగింది అంటూ చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో మరో విషయం బయటకు వచ్చింది. అదే ‘డాన్’ పాత్రను మరోసారి పోషించడానికి గతంలో నిరాకరించిన స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఓకే చెప్పారు అని సమాచారం. అయితే ఓ షరతు పెట్టారని బాలీవుడ్ టాక్.
Don 3
‘డాన్ 3’ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరో అని దర్శకుడు ఫరాన్ అక్తర్ అనౌన్స్ చేసినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ పాత్రలో షారుఖ్ ఖాన్‌ను మాత్రమే ఊహించుకోగలమని.. ఇంకో హీరో వద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రెండింగ్‌లో ఉంచారు. అయితే దర్శకుడు ఫరాన్ అక్తర్ మాత్రం రణ్‌వీర్ కూడా ఆ పాత్రకు బాగుంటాడు అని నమ్మారు. అయితే ఇప్పుడు ఆ సినిమా రణ్‌వీర్ తప్పుకున్నాడు. దీంతో గతంలో వద్దన్న షారుఖ్ దగ్గరకే మళ్లీ సినిమా వెళ్లిందట. ఆయన కూడా దాదాపుగా ఓకే అన్నారట.

ఈ సినిమా చేయడానికి షారుఖ్ ఓ కండిషన్ పెట్టినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. తనకు ‘జవాన్’ భారీ బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన అట్లీని ఈ ఫ్రాంచైజీలోకి తీసుకొస్తేనే తాను మళ్లీ ‘డాన్’ అవతారం ఎత్తడానికి రెడీ అని చెప్పాడట. అంటే ఫరాన్ అక్తర్ టేకింగ్ విషయంలో షారుఖ్ అంత ఆసక్తిగా లేడని అర్థమవుతోంది. మరి ఈ విషయంలో ఫరాన్ ఏమంటాడో చూడాలి. ఇక ఈ సినిమాలో తొలుత కియారా అడ్వాణీని హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, ఇప్పుడు కృతి సనన్ పేరును పరిశీలిస్తారని సమాచారం. గతంలో విలన్ పాత్ర కోసం విక్రాంత్ మసే, విజయ్ దేవరకొండను ‘డాన్ 3’ బృందం కాంటాక్ట్ అయింది. ఇప్పుడు షారుఖ్ తిరిగి ప్రాజెక్ట్‌లోకి వస్తే విలన్ ఎవరొస్తారో చూడాలి.












