‘పెద్ది’ సినిమా ట్రైలర్ వచ్చి ఇన్ని రోజులైంది.. ఇప్పుడు ట్రైలర్ దాచిన విషయాలు ఇవీ అంటూ చెబుతున్నాం అనుకోవద్దు. ఎందుకంటే సినిమా ట్రైలర్ రాగానే ‘ఇవి గమనించారా?’, ‘ఈ విషయం తెలుసా?’, ‘ఈ పాయింట్ చూశారా’ అంటూ వరుస వీడియోలు, వార్తలు వచ్చేస్తుంటాయి. వాటిని మీరు చూసే ఉంటారు కూడా. అందుకే ఇప్పుడు మేం సినిమా ట్రైలర్ గురించి విశ్లేషణ లాంటివి చేయడం లేదు. ట్రైలర్‌లో దర్శకుడు బుచ్చిబాబు అక్కడక్కడా వదిలేసిన డాట్స్‌ని కలిపితే ఓ కథ బయటకు వచ్చింది. సినిమా కథ కూడా అదే అవుతుంది అనిపిస్తోంది.
సినిమాలో హీరో పెద్ది అనాథ. తన గూడెం వాళ్లలో తలలో నాలుకలా ఉంటాడు. ఆ గూడేనికి పెద్దమనిషి, సామాజిక అంశాల మీద పోరాడే నాయకుడు అప్పలసూరి (జగపతిబాబు) అంటే పెద్దికి చాలా ఇష్టం. పెద్ది ఉండే గూడేనికి చెందిన వాసులు అడవిలో తాము పండించుకునే, పండే వస్తువులను అమ్ముకోవడానికి కొండలు, అడవి దాటి పట్టణానికి వెళ్తుంటారు. తమ గూడెం దగ్గరి నుండే రైల్వే ట్రాక్ ఉండి, రైలు వెళ్తున్నా వారి గూడెంలో స్టాప్ లేక ఇబ్బందులు పడుతుంటారు.
దీంతో రైలు స్టేషన్/ స్టాపేజీ కోసం అప్పలసూరి పోరాడుతుంటాడు. ఆ పట్టణంలో ఉండే కొంతమంది వ్యాపారస్థులకు ఆ గూడేనికి రైలు స్టాపేజీ సౌకర్యం రావడ నచ్చదు. దానికి కారణం వారు అక్కడ అక్రమ వ్యాపారం చేస్తుండటమే. దీంతో ఎలాగైనా వాళ్ల గూడేనికి రైల్వే స్టేషన్ రప్పించాలని అప్పలసూరి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లి వాళ్ల ఎంపీ ద్వారా రైల్వే మంత్రిని కలిసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో అతన్ని విలన్లు చంపేస్తారు. దీంతో ఆ బాధ్యతను పెద్ది తీసుకుంటాడు.
నేరుగా ప్రయత్నిస్తే గూడేనికి మంచి జరగదని.. ఊరుకు గుర్తింపు సంపాదిస్తే మంచి జరుగుతుందని సన్నిహితులు చెప్పడంతో కుస్తీలో తన ప్రతిభతో ఢిల్లీలో స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనాలని చూస్తాడు. అయితే విలన్ల బ్యాచ్ పెద్ది కాలు విరగ్గొట్టేస్తారు. అప్పుడు పెద్ది తీవ్ర పోరాటాలు చేసి పారాలింపిక్స్‌లో రన్నింగ్‌లో దివ్యాంగుడిగా పోటీ పడి గెలిచి.. ఊరుకు మంచి పేరు సాధించి.. రైల్వే స్టాప్ సంపాదిస్తాడు. బాగుంది కదా కథ. ఇప్పుడు ఇదే అసలు కథ అని ఓ టాక్ సోషల్ మీడియాలో ఉంది. నిజమేంటో తేలాలంటే జూన్ 4న ‘పెద్ది’ రావాల్సిందే.