‘దేవర’ సినిమాలో తంగం.. ‘పెద్ది’ సినిమాలో అచ్చియమ్మ.. ఈ రెండు పాత్రల విషయంలో జాన్వీ ఎంత హ్యాపీగా ఉందో తెలియదు కానీ.. ఆమె అందాన్ని ఆరాధించే ఆమె అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆమెను ఎంత అందంగా చూపించాలో అంతగా చూపించారు. అయితే ఆమెలో నటిని చూద్దాం అనుకునేవాళ్లు మాత్రం ‘ఛస్ జాన్వీ పాపని ఇలా చేసేశారేంట్రా’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేవర’ సినిమా అప్పటి కంటే ‘పెద్ది’ అప్పుడు బాగా హర్ట్ అయ్యారు.
ఈ క్రమంలో జాన్వీ ఇక సౌత్ సినిమాల వైపు రాదు. ఇప్పట్లో ఆమె నుండి తెలుగు/ తమిళ/ కన్నడ/ మలయాళ సినిమాలు చూడటం అసాధ్యమే అని అనుకున్నారంతా. ఈ మేరకు ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా హర్ట్ అయ్యారు. ఆయనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని చూస్తే.. సగం నిజం ఉంది అని తేలుతోంది. ఎందుకంటే జాన్వీ ఇప్పుడు సౌత్ సినిమాలు ఏవీ అంగీకరించడం లేదు. అయితే ఓ వెబ్‌సిరీస్‌ని ఓకే చేసింది అనే వార్త ఒకటి బయటకు వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఓ వెబ్‌సిరీస్‌ను షో రన్నర్‌గా తెరకెక్కిస్తున్నారట. ఆ సిరీస్‌ని శర్కుణం దర్శకత్వం వహిస్తారట. అందులో ప్రధాన పాత్రధారిగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసుకున్నారు అని చెబుతున్నారు. ఈ సిరీస్‌కి ‘కురాతి’ అనే పేరు కూడా ఫిక్స్ చేశారు అని తెలుస్తోంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఈ సిరీస్‌ను ప్రకటిస్తుందని భోగట్టా.
పా రంజిత్ సినిమాలు సగటు మాస్, కమర్షియల్ లైన్‌ను దూరంగా ఉంటాయి. సమాజంలో కీలక అంశాలను ఆయన చర్చలోకి తీసుకొస్తారు. మరిప్పుడు జాన్వీ కపూర్ సిరీస్‌తో ఏం చెప్పబోతున్నారు, ఏం చర్చ పెట్టబోతున్నారు అనేది చూడాలి.