కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన కెరీర్‌లో ఆఖరి సినిమాగా చేస్తున్న ‘జన నాయకన్’ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంది. రాజకీయాల్లోకి వెళ్లేముందు విజయ్ ఇస్తున్న ఈ ‘పొలిటికల్ స్పీచ్’ లాంటి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడింది. సినిమాలో సాయుధ దళాల చిత్రీకరణ, కొన్ని రాజకీయ అంశాలపై సెన్సార్ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేయడమే దీనికి ప్రధాన కారణం.
ఈ సినిమా సర్టిఫికేషన్ విషయంలో ప్రస్తుతం న్యాయపోరాటం నడుస్తోంది. మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ మద్రాస్ హైకోర్టుకే బాధ్యతను అప్పగించింది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు జనవరి 20న మద్రాస్ హైకోర్టులో జరగబోయే తుది విచారణపైనే ఉన్నాయి. కోర్టు నుండి సానుకూల తీర్పు వస్తేనే విజయ్ సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ విచారణలో జాప్యం జరిగితే మాత్రం ‘జన నాయకన్’ విడుదలకు మరిన్ని కష్టాలు తప్పవు. ఎందుకంటే తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తే రాజకీయ పరమైన వివాదాలు ఉన్న సినిమాల విడుదలకు రూల్స్ అడ్డంకిగా మారతాయి. ఒకవేళ ఫిబ్రవరి నెల మిస్ అయితే, ఈ సినిమా జూన్ వరకు థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇది విజయ్ అభిమానులకు, ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉండటం విశేషం. విజయ్ తన రాజకీయ ప్రయాణానికి పునాదిగా భావిస్తున్న ఈ సినిమా కోసం భారీగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. సెన్సార్ బోర్డు సూచించిన 27 కట్స్ విషయంలో మేకర్స్, బోర్డు మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. న్యాయస్థానం ఇచ్చే తీర్పు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం జనవరి నెలాఖరులో బాక్సాఫీస్ వద్ద విజయ్ జైత్రయాత్ర మొదలవుతుంది.