తమిళనాడు సీఎం దళపతి విజయ్ (Vijay) చివరి మూవీగా జననాయగన్ గురువారం తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా….మమితా బైజు ఓ కీలక పాత్రను పోషించింది. బాలకృష్ణ భవంత్ కేసరికి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీకి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించారు జాననాయకుడుగా తెలుగులో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? చివరి సినిమాతో విజయ్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడా? అంటే?
కథ: దళపతి వెట్రి కొండన్ (Vijay) ఓ పోలీస్ ఆఫీసర్. డీఎస్‌పీ అమ్రిష్ పుజారిని (Bobby Deol) చంపిన కేసులో జైలు పాలవుతాడు. ఈ కేసులో దళపతికి వ్యతిరేకంగా అతడి తల్లి (రేవతి) సాక్ష్యం చెబుతుంది. ఆ పశ్చాత్తాపంతో ఆమె చనిపోతుంది. తల్లి చివరి కోరికను నెరవేర్చడంలో దళపతికి జైలర్ సాయం చేస్తాడు. అతడి కూతురు విజ్జతో (Mamitha Baiju) దళపతికి అనుబంధం ఏర్పడుతుంది. జైలర్ చనిపోవడంతో విజ్జీ బాగోగులు దళపతి చేపడతాడు. ఆమెను ఆర్మీలో జాయిన్ చేయాలని అనుకుంటాడు. కానీ విజ్జీ ఫియర్ ఫోబియాతో పాటు మరికొన్ని మానసిక సమస్యలతో బాధపడుతుంది. దాంతో ఆర్మీలో జాయిన్ కావడానికి ఇష్టపడదు.
తమిళనాడు రాజకీయ నాయకుడు రోజా రంగసామితో (ప్రకాస్ రాజ్) కలిసి జాన్ హిమ్మర్ (బాబీ డియోల్) అనే గ్యాంగ్‌స్టర్ మతకల్లోలాలకు ప్లాన్ చేస్తాడు. వారి కుట్రలను దళపతి ఎలా తిప్పికొట్టాడు? అసలు విజ్జీని చంపాలని హిమ్మర్ మనుషులు ఎందుకు అనుకున్నారు? నిజాయితీపరుడైన ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రిష్…అవినీతి పరుడిగా ఎందుకు మారాడు? దళపతికి వ్యతిరేకంగా అతడి తల్లి ఎందుకు తప్పుడు సాక్ష్యం చేసింది? దేశాన్ని కాపాడటంతో దళపతికి కయల్ ( పూజా హెగ్డే) ఎలా అండగా నిలిచింది? దళపతి మంచితనాన్ని విజీ అర్థం చేసుకుందా? ఆమెలోని భయాలు తొలగిపోయాయా? అన్నదే జననాయకుడు మిగతా కథ.
నటీనటుల పనితీరు: జననాయగన్‌కు (Jana Nayakudu) విజయ్ నటనే హైలైట్. దళపతి పాత్రలో వీరతాండవమే చేశాడు. అతడి ఇమేజ్, స్టార్‌డమ్‌ను బేస్ చేసుకొని ప్రతి సీన్‌ను డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్. యాక్షన్ సీన్లలో విజయ్ ఎలివేషన్లు, పొలిటికల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు కన్నుల పండుగలా ఉన్నాయి. ఎమోషనల్ సీన్లలో విజయ్ నటన మనసులను కదిలిస్తుంది. పూజా హెగ్డే రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లా కనిపించింది. మమితా బైజు నటన ఒకే.
ఆమెతో విజయ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్‌లో యాక్షన్‌తో అదరగొట్టింది. స్టైలిష్ విలన్‌లా బాడీ డియోల్ కనిపించారు. విజయ్‌కి ధీటుగా అతడి విలనిజం సాగింది. రోజా రంగస్వామిగా ప్రకాష్ రాజ్, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పోలీస్ ఆఫీసర్‌గా సునీల్ మెప్పించారు. గౌతమ్ మీనన్, నాజర్, నరేన్‌తో పాటు చాలా మందే సీనియర్ యాక్టర్లు తమ పరిధుల మేర ఆకట్టుకున్నారు. చివరలో డైరెక్టర్లు అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ గెస్ట్‌లుగా మెరిశారు. ఆ సీన్‌కు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమే.
సాంకేతిక వర్గం పనితీరు: భగవంత్ కేసరి మూలకథను తీసుకొని తనదైన స్టైల్‌లో చాలానే మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు హెచ్ వినోథ్. విజయ్ పొలిటికల్ ఇమేజ్ తగ్గట్లుగా సినిమా ఉంది. విజయ్‌ని అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో ఆ కమర్షియల్ హంగులన్నీ ఉండేలా జాగ్రత్తపడ్డారు. అనిరుధ్ పాటల్లో దలపతి కచేరీ పాట బాగుంది. బీజీఎమ్ కథకు తగ్గట్లుగా సాగింది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కావాల్సినదానికంటే ఎక్కువే ఖర్చుపెట్టారు. సినిమాటోగ్రఫీ,ప్రొడక్షన్ డిజైనింగ్ విభాగాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
విశ్లేషణ: బాలకృష్ణ హీరోగా నటించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీ భగవంత్ కేసరి ఆధారంగా జననాయగన్ మూవీ రూపొందింది. తెలుగు వెర్షన్ లిమిటెడ్ బడ్జెట్‌లో ఎమోషనల్ డ్రామాగా రూపొందితే…తమిళ వెర్షన్‌ను మాత్రం భారీ బడ్జెట్‌తో యాక్షన్ సినిమాలా మార్చేశారు. భగవంత్ కేసరిలోని బాలకృష్ణ, శ్రీలీల ట్రాక్‌ను జననాయగన్‌లో ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేశారు. విలన్ ట్రాక్‌ను మాత్రం పూర్తిగా కొత్తగా రాసుకున్నారు.ఆ సన్నివేశాలు విజయ్ రాజకీయ భావజాలంతో ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉన్నాయి.
సినిమాలో విజయ్ పాత్ర పేరు…. ఆయన పొలిటిక్ పార్టీ టీవీకేను సూచిస్తుంది. సందు దొరికిన ప్రతిసారి తమిళనాడులోని ప్రతి పక్ష పార్టీలపై సెటైర్లు వేస్తూనే వెళ్లారు విజయ్. రెండు పార్టీలు కలిపి ఏళ్లకు ఏళ్లు ప్రజలను దోచుకున్నాయని, వారిని ఎదురించే ఓ శక్తి రావాలంటూ విజయ్ రాజకీయ అరంగేట్రాన్ని సూచించే డైలాగ్స్ చాలానే సినిమాలో ఉన్నాయి. అవన్నీ ఫ్యాన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. అలాగని కథను ఎక్కడ పక్కనపెట్టలేదు.స్టోరీలో అంతర్లీనంగానే వచ్చేలా ఆ డైలాగ్స్, సీన్లను రాసుకోవడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్ హాఫ్ దళపతి, విజ్జీ మధ్య అనుబంధంతో ఎమోషనల్‌గా సాగుతుంది. సెకండాఫ్ కంప్లీట్ యాక్షన్ మోడ్‌లోకి ఎంటరయ్యారు డైరెక్టర్. మతకల్లోలాలు, రిమోట్ గన్స్‌తో దేశంలో కుట్రలు చేయడానికి విలన్ గ్యాంగ్ ప్రయత్నాలు చేయడం, వారి ఎత్తులను హీరో తిప్పికొట్టే సీన్లు గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. విలన్‌కు హీరోకు మధ్య ఓ సంబంధం ఉన్నట్లుగా చూపిస్తూ ఫ్యాష్‌బ్యాక్‌లోకి ఎంటరయ్యారు. ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ రా అండ్ రస్టిక్‌గా సాగింది. ప్రకాష్ రాజ్ ప్యాలెస్‌లోకి విజయ్ ఎంటరై అతడితో ఫైట్ చేసే సీన్ థ్రిల్లింగ్ ఉంది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ రోబోలతో హాలీవుడ్ సినిమాల లెవెల్‌లో సాగింది. విలన్ ట్రాక్ పెడిక్టబుల్‌గా సాగడం మైనస్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ రోబోలో ఫైట్ కూడా ఆకట్టుకోదు.
సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ లెంగ్త్. మూడు గంటల మూడు నిమిషాల రన్‌టైమ్ ఎక్కువే అనిపిస్తుంది. భగవంత్ కేసరి చూసిన వాళ్లకు కూడా జననాయగన్ కొత్తగా అనిపిస్తుంది. కథా పరంగా సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా విజయ్ తనదైన స్టైల్ యాక్టింగ్, మ్యానరిజమ్స్‌తో చాలా వరకు వాటిని కవర్ చేశారు.
ఫోకస్ పాయింట్: జననాయకుడు దళపతి విజయ్ వన్ మెన్ షోగా నిలుస్తుంది. దళపతి ఫ్యాన్స్‌కు ఫేర్‌వెల్ ట్రీట్‌లా ఈ సినిమా ఉంటుంది.
రేటింగ్: 2.75/5