జాన్వీ కపూర్ టాలీవుడ్‌కి రావాలి.. ఆ బ్యూటీ వైబ్‌ని, నటనను మనం ఆస్వాదించాలి అని సౌత్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా ఏళ్లుగా ఎదురుచూశారు. టాలీవుడ్‌కి రాదా.. కేవలం బాలీవుడ్‌లోనే ఉండిపోతుందా అనే భయాందోళన కూడా కలిగింది. అలాంటి సమయంలో ‘దేవర’ సినిమాతో ఆమెను తెలుగులోకి తీసుకొచ్చారు కొరటాల శివ – ఎన్టీఆర్. ఆ వెంటనే తారక్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫ్రెండ్ రామ్‌చరణ్ – బుచ్చిబాబు సానా కలసి ‘పెద్ది’ సినిమాలోకి తీసుకొచ్చారు.
ఆ రెండు సినిమాల ఫలితాలు, వాటి వసూళ్ల లెక్కలు – తేడాలు ఇవన్నీ పక్కన పెడితే రెండింటిలోనూ జాన్వీ పాత్ర దాదాపు ఒకేలా ఉంటుంది. దీంతో ఒకేలా విమర్శలు ఎదుర్కొంది జాన్వీ. ఇలాంటి స్కిన్ షో పాత్రలు తప్ప ఇంకేం పాత్రలు చేయదా అనేలా అప్పట్లో ప్రేక్షకులు మాట్లాడారు. అలాగే జాన్వీ అంటే ఇలాంటి సీన్సే రాస్తారా అంటూ డైరక్టర్ల మీద కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఇక జాన్వీ మరో తెలుగు సినిమాలో నటించదు అంటూ వార్తలు వచ్చాయి.
నిజానికి జాన్వీ కపూర్‌ను ముచ్చటగా మూడోసారి ట్రోల్ చేసే అవకాశాన్ని మన నెటిజన్లు కోల్పోయారు అంటే నమ్ముతారా? అవును ఇప్పుడు సుబ్బు పాత్ర చేసి విమర్శలు ఎదుర్కొంటున్న, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాటలు పడుతున్న ఆ పాత్ర కోసం తొలుత సంప్రదించింది జాన్వీ కపూర్. అవును మీరు చదివింది కరెక్టే. ‘పెద్ది’ సినిమా సమయంలోనే ‘ప్యారడైజ్’ ఆఫర్ కూడా జాన్వీకి వచ్చింది. కానీ ఆమె అప్పుడు ఎందుకో కానీ చేయలేదు.
అదే ఆ సినిమా ఆమె చేసి ఉంటే.. ‘దేవర’లో తంగమ్, ‘పెద్ది’ అచ్చియమ్మ కంటే ఎక్కువగా ‘ప్యారడైజ్’లో సుబ్బు ఎక్కువ మాటలు పడేది. ఆ రెండు సినిమాల ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ డబుల్ ఉండేది. ఇప్పుడు చెప్పండి హ్యాట్రిల్ ట్రోలింగ్ నుండి జాన్వీ బయటపడిందా లేదా?