ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన సినిమాలలో ఏవి హిట్, ఏవి ఫట్?..

బోలెడన్ని ఆశలతో, కొత్త కోరికలతో 2023కి వెల్‌కమ్ చెప్పింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ.. బ్లాక్ బస్టర్ హిట్స్, కోట్లాది రూపాయల కలెక్షన్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడాలని.. పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా మరింత ఉన్నతంగా ఎదగాలంటూ పరిశ్రమ వర్గాల వారు కోరుకుంటూ.. జనవరిలో తమ సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. చూస్తుండగానే జనవరి అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.

సంక్రాంతి అనేది తెలుగు వారి పెద్ద పండగ కాబట్టి మేకర్స్ పెద్ద, చిన్న సినిమాలను అప్పుడే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారి కూడా చిరంజీవి, బాలకృష్ణ లాంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ బాక్సాఫీస్ బరిలో దిగారు. పనిలో పనిగా కోలీవుడ్ స్టార్స్ విజయ్, అజిత్ ఇద్దరూ తమ డబ్బింగ్ బొమ్మలతో వచ్చారు. తర్వాత మరికొన్ని చిత్రాలు వచ్చాయి. ఈనెలలో విడుదలైన సినిమాలు, వాటి ఫలితాల వివరాలు ఏంటనేది చూద్దాం..

తెగింపు – యావరేజ్

‘తల’ అజిత్ కుమార్‌కి తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉంది. హెచ్.వినోద్ కుమార్ డైరెక్ట్ చేసిన ‘తునివు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న కోలీవుడ్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదలైంది. అజిత్ వన్ మెన్ షో అంటూ పాజిటివ్ రిపోర్ట్స్, భారీ కలెక్షన్స్ వచ్చాయి కానీ ఇక్కడ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది..

వీరసింహా రెడ్డి – సూపర్ హిట్

నటసింహ నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో మైత్రీ మూవీస్ నిర్మించిన ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వీరసింహా రెడ్డి’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది..

వాల్తేరు వీరయ్య – బ్లాక్ బస్టర్

మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఫిలిం ‘వాల్తేరు వీరయ్య’.. రవితేజతో కలిసి ప్రేక్షకాభిమానులను ఆకట్టుకోవడంతో పాటు బూజ్ పట్టిన బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాడు బాస్.. రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

వారసుడు – హిట్

దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ భారీగా ప్లాన్ చేశారు నిర్మాత దిల్ రాజు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తమిళంలో ‘వరిసు’ గా జనవరి 11న, తెలుగులో ‘వారసుడు’ పేరుతో జనవరి 14న వచ్చింది. కలెక్షన్స్ సునామీ సృష్టించి బాక్సాఫీస్ బరిలో హిట్‌ అనిపించుకుంది.

కళ్యాణం కమనీయం – డిజాస్టర్

యూవీ క్రియేషన్స్ వారు వదిలించుకోవాలనుకున్నారో, కంటెంట్ మీద నమ్మకమో తెలియదు కానీ పెద్ద సినిమాల మధ్య ‘కళ్యాణం కమనీయం’ వంటి చిన్న సినిమాను వదిలారు. అసలు సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలామందికి తెలియదు అంటే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీతో తమ బ్యానర్ నుండి డిజాస్టర్ ఇచ్చారు.

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన ‘విద్యావాసుల అహం’ చిత్రాన్ని కూడా పండక్కే వదలాలి అనుకుని వాయిదా వేసుకున్నారు. తర్వాత జనవరి 26న రిలీజ్ చేయాలనుకుని.. ఫిబ్రవరి 4కి పోస్ట్‌పోన్ చేశారు.

పఠాన్ – బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాక.. గతకొద్ది కాలంగా సరైన సినిమాలు లేక డీలా పడ్డ బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు కాపాడాడు.. ఫస్ట్ డే నుండే రికార్డ్ రేంజ్ వసూళ్లతో సత్తా చాటుతూ.. ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ టచ్ చేసింది..

హంట్ – బిగ్ డిజాస్టర్

జనవరి నెల ‘హంట్’ అనే బిగ్ డిజాస్టర్‌తో ముగిసింది. సుధీర్ బాబు, ‘ప్రేమిస్తే’ భరత్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ జనాలను ఆకట్టుకోవడంలో విఫలమైంది.. ఫిబ్రవరి నెలలో కంటెంట్‌తో కూడిన కొత్త సినిమాలు రాబోతున్నాయి.. అవి తప్పకుండా ప్రేక్షకాదరణ దక్కించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus