ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పైరసీ భూతాన్ని ఆపలేక పోతున్నారు. పెరిగిన టెక్నాలజీ పైరసీ కి అండగా నిలుస్తోంది. సెన్సార్ కాపీ అంటూ కొన్ని రోజులక్రితం ఉడ్తా పంజాబ్ సినిమా వీడియో నెట్ లో హల్ చల్ చేసింది. విడుదలకు ముందే పైరసీ మార్కెట్లో లభించడంతో ఆ చిత్ర నిర్మాత షాక్ తిన్నాడు. ఇలా చిన్న చిత్రాలకే జరుగుతుంది అనుకుంటే పొరపాటే. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం సుల్తాన్ కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది.
ఇప్పుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కబాలి ని సైతం పైరసీ భూతం వదల్లేదు. ఈ ఫిల్మ్ మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రానుండగా తమిళ వెర్షన్ ఆన్ లైన్లో వచ్చేసింది. ఊహించని పరిణామానికి ఉలిక్కిపడ్డ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను పోలీసులను సంప్రదించారు. వారు వెంటనే స్పందించి పైరసీ సినిమా వీడియో లభ్యమయ్యే లింకులన్నింటినీ తొలగించారు.
అప్పటికే డౌన్లోడ్ చేసుకున్నఎవరైనా నెట్ లో సినిమాను అప్లోడ్ చేస్తారేమోనని, వాటిని అడ్డుకోవడానికి నిర్మాత ప్రత్యేక టెక్నీకల్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.