కాజల్ – గౌతమ్ కిచ్లూ మధ్య ప్రేమబంధం ఉందటని చాలా ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. ఇద్దరూ తరచుగా టూర్లకు వెళ్లేవారు కూడా. అయితే ఎక్కడా వారి ప్రేమ బంధాన్ని బహిర్గతం చేయలేదు. అయితే హఠాత్తుగా కరోనా సమయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. దీంతో ఏమైంది, ఏం జరిగింది అనే విషయంలో కాజల్ క్లారిటీ ఇచ్చింది. దాంతోపాటు తనయుడు నీల్ గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. కాజల్ అమ్మయ్యాక వెండితెరపైన మునపటి హవా చూపించే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఒక పక్క మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే… మరోవైపు నటిగా రాణించే ప్రయత్నం చేస్తోంది. ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ గౌతమ్ తనకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమని, ఏడేళ్లు స్నేహం చేశాక వ్యక్తిత్వం బాగా నచ్చిందని, కానీ ఆ విషయం తనకు చెప్పలేదని తెలిపింది. అంతేకాదు గౌతమ్కీ తనంటే ఇష్టం ఉన్నా బయట పడలేదని తెలిపింది.
లాక్డౌన్ సమయంలోనే ఒకర్ని విడిచి మరొకరం ఉండలేమని అర్థమయ్యాక పెళ్లి చేసుకుందామనుకున్నారట. ఆ విషయంలో ఇంట్లో కాజల్ వాళ్ల అమ్మకి చెబితే ఒప్పుకున్నారట. కానీ వాళ్ల నాన్న మొదట్లో ఒప్పుకోలేదట. ఇద్దరివీ వేర్వేరు వృత్తులు కావడంతో భయపడ్డారట. కానీ కాజల్ వాళ్ల నాన్నను అమ్మే ఒప్పించిందట. మొదట్లో అలా భయపడ్డ నాన్న… ఇప్పుడు గౌతమ్ని కొడుకులా చూసుకుంటున్నారని కాజల్ చెప్పుకొచ్చింది.
ఇక కొడుక్కి నీల్ అని పేరు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని కూడా కాజల్ చెప్పుకొచ్చింది. తనకు భక్తి ఎక్కువని, శివుణ్ని ఆరాధిస్తుంటానని తెలిపింది. అందుకే తన పిల్లలకు ఆ దేవుడి పేరే పెట్టాలని ముందే అనుకుందట. మరోవైపు పలకడం, రాయడం కూడా తేలికగా ఉండే పేరునే పెడదాం అని గౌతమ్ అన్నారట. దాంతో నీలకంఠుడి పేరులోని మొదటి రెండు అక్షరాలను తీసుకుని బాబుకి నీల్ అని పేరు పెట్టామని కాజల్ (Kajal) తెలిపింది.