బాలీవుడ్లో చాలా మంది కథానాయికలు కేవలం నటనకే పరిమితం కాకుండా తమ అభిరుచి మేరకు సినిమాలను నిర్మించేందుకు ప్రొడక్షన్ హౌస్లను ఏర్పాటు చేస్తున్నారు. అనుష్కశర్మ, ప్రియాంక చోప్రా వంటి స్టార్ కథానాయికలు ఇప్పటికే తమ బ్యానర్ల ద్వారా తెరకెక్కించిన చిత్రాలతో విజయాల్ని అందుకున్నారు. అంతేకాదు ప్రాంతీయ సినిమాలను తమదైన పంథాలో ప్రోత్సహిస్తున్నారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రాంతీయ సినిమా సత్తా ఏమిటో తెలిపే ప్రయత్నమూ చేస్తున్నారు. వీరి జాబితాలోకి తాజాగా కాజల్ కూడా చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట.
మహిళా ప్రధాన కథతో దర్శకుడు తేజ రూపొందించబోయే చిత్రంలో కాజల్ నటించడంతోపాటు నిర్మించేందుకు కూడా రంగం సిద్ధం చేసిందని సమాచారం. తేజ, కాజల్ కాంబినేషన్లో రూపొందబోయే నాలుగవ చిత్రమిది. ‘లక్ష్మీకళ్యాణం’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘సీత’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందబోయే ఈ సినిమాపై అందరిలోనూ మంచి ఆసక్తి ఏర్పడింది.