మాస్ మహారాజ్ రవితేజ రెండేళ్ల గ్యాప్ తరవాత ‘రాజా ది గ్రేట్’ తో వచ్చి హిట్ అందుకున్నారు. ఇందులో అంధుడిగా అదరగొట్టారు. తర్వాత విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో చేసిన టచ్ చేసి చూడు ఆశించినంత విజయం సాధించలేదు. అయినా ఫలితంతో కుంగిపోకుండా మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. “సోగ్గాడే చిన్నినాయన”, “రారండోయ్ వేడుక చూద్దాం” విజయాలతో దూసుకుపోతున్న కళ్యాణ్ కృష్ణతో మూవీ మొదలెట్టారు. ఇది జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ లో రవితేజకి ప్రమాదం జరిగిందని రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా బలమైన గాయాలు తగిలాయని, ప్రస్తుతం మాస్ మహారాజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానులు ఆందోళన పడ్డారు. ఈ విషయంపై ఆరా తీయడం మొదలెట్టారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కైతే ఈరోజు అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని సమాచారం. దీంతో అతను స్పందించారు. “అసలేం జరగలేదు.. అవన్నీ పుకార్లు.. ఎవరు ఆందోళన చెందొద్దు. రవితేజ చాలా ఆరోగ్యంగా ఉన్నారు” అని ట్వీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.