Kamal – Rajini: ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేసిన కమల్‌ హాసన్‌.. తలైవాతో..

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కలసి నటిస్తారు అంటూ గతకొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తమిళనాట అగ్ర దర్శకులు ఏదైనా సినిమా ముందుకొచ్చినా ఇంటర్వ్యూల్లో, పుకార్లలో ఇదే వార్త కనిపిస్తూ వచ్చింది. ఇటు రజనీకాంత్‌, అటు కమల్‌ హాసన్‌ సినిమాలు వచ్చినప్పుడు.. వారితో సినిమాలు చేసిన దర్శకుల ప్రాజెక్ట్‌లు వచ్చినప్పుడు కూడా ఇదే మాట మీద చర్చ జరుగుతూ వచ్చింది. మొన్నీమధ్య ‘కూలీ’ సినిమా వచ్చినప్పుడు కూడా ఈ మాట విన్నాం.

Kamal – Rajini

దీంతో ‘అట’, ‘ఇట’ అంటూ మేం కూడా మీకు వార్తలు చెబుతూ వచ్చాం. ఇప్పుడు ఆ అవసరం ఇక లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని కమల్‌ హాసనే క్లారిటీ ఇచ్చేశారు. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ 46 ఏళ్ల తర్వాత కలిసి స్క్రీన్‌పై కనిపించనున్నారని ఇక మనం ఫిక్స్‌ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాను కమల్‌ హాసన్‌ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకలో కమల్‌ హాసన్‌ ఈ అప్‌డేట్‌ ఇచ్చారు.

‘మీ, రజనీ కాంబినేషన్‌లో సినిమా ఆశించవచ్చా’ అని హోస్ట్‌ అడగ్గా.. ప్రేక్షకులు మా కాంబినేషన్‌ను ఇష్టపడితే మంచిదే కదా. వారు సంతోషంగా ఉంటే మాకూ ఆనందమే. మేమిద్దరం కలసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఇన్ని రోజులు అది కుదర్లేదు. త్వరలోనే మీ ముందుకు కలసి రానున్నాం. మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేసే ప్రాజెక్ట్‌ అది అని కమల్‌ హాసన్‌ చెప్పారు. ఆ సినిమాకు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తారని, అది గ్యాంగ్‌స్టర్‌ల నేపథ్యంలోనే ఉంటుందని తాజా లీకుల సారాంశం.

రజనీ, కమల్‌ కలిసి 20కి పైగా సినిమాలు చేశారు. అయితే అదంతా 1980కి ముందే. ఆ తర్వాత మళ్లీ తెర పంచుకోలేదు. 1979లో వచ్చిన ‘అల్లాఉద్దీన్ అద్భుత దీపం’ తర్వాత ఇద్దరు కలిసి నటించలేదు. ఇన్నేళ్లకు ఇప్పుడు కుదురుతోంది అన్నమాట. మాణిక్ బాషా, వీరయ్య నాయుడు వయసయ్యాక తిరిగి తమ పాత జీవితంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఒకటి తనకు ఉందని ఇటీవల లోకేష్ కనగరాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఆ ఆలోచనతో కథను ఏమన్నా సిద్ధం చేస్తారేమో చూడాలి.

 మోక్షు.. ఏమైందమ్మా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus