గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని అతి తక్కువ సమయంలో తెరకెక్కించిన క్రిష్ మరో భారీ ప్రాజక్ట్ అందుకున్న విషయం తెలిసిందే. వీరనారిగా కీర్తి పొందిన ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితాన్ని వెండితెరపై చూపించే బాధ్యతను తీసుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి ‘మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి హిందీలో నిర్మిస్తున్న
ఈ మూవీకి బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందించారు. కాశీలో ప్రారంభమైన ఈ షూటింగ్ నిన్నటితో కంప్లీట్ చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమాని ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అయితే షూటింగ్ సమయంలో కంగనాకు గాయం కావడంతో వాయిదా పడింది. పైగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అధికంగా ఉండడంతో ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి చిత్ర బృందం ఫిక్స్ అయింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.