బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ కరీనా కపూర్. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన కరీనా పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం సినిమాలు తగ్గించేసింది.. తనకన్నా వయసులో చాలా పెద్దవాడైన సైఫ్ అలీఖాన్ ను ప్రేమించి పెళ్లాడింది కరీనా.
కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో నటీమణులు (Kareena Kapoor) కరీనా కపూర్ ఖాన్, అలియాభట్ తాజాగా సందడి చేశారు. తమ కెరీర్‌పై పలు విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా.. ‘‘సారా అలీఖాన్ (కరీనా భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె)కు తల్లిగా నటించే అవకాశం వస్తే నటిస్తావా? దక్షిణాదికి చెందిన ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నావు?’’ అంటూ కరీనాను కరణ్ జోహర్ ప్రశ్నించాడు.
దీనికి ఆమె బదులిస్తూ.. ‘‘నేనొక నటిని. ఎలాంటి పాత్రలైనా చేయాలి. ఒకవేళ సారాకు తల్లిగా నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తా. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే దక్షిణాదికి చెందిన యశ్ యాక్టింగ్ నాకెంతో నచ్చుతుంది. ఆయన పక్కన యాక్ట్ చేయాలని ఉంది. ‘కేజీయఫ్’ చూశా. సినిమా బాగా నచ్చింది’’ అని చెప్పారు.
కాఫీ విత్ కరణ్ సీజన్ 8.. డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతీ గురువారం కొత్త ఎపిసోడ్ వస్తోంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్లో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణ్ వచ్చారు. ఆ తర్వాత సన్నీ డియో బాబీ డియోల్, మూడో ఎపిసోడ్‌కు సారా అలీఖాన్, అనన్య పాండే గెస్టులుగా పాల్గొన్నారు.