‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి… కుర్రాడిలో మ్యాజిక్ ఉంది అని నిరూపించుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత వెంటనే ‘గ్యాంగ్‌లీడర్’లో విలన్‌గా కనిపించి… వీడు మాములోడు కాడు.. ఏ పాత్ర అయినా చేసేస్తాడు అనిపించుకున్నాడు. ఏదో కొత్త కదా అన్ని రకాల పాత్రలు చేయాలని ఒప్పుకున్నాడేమో అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నది కరెక్ట్ కాదని నిరూపిస్తూ… అజిత్ ‘వాలిమై’ సినిమాలో విలన్‌గా సైన్ చేశాడు. దీంతో అవాక్కవడం సినిమా జనాల వంతు అయ్యింది. తాజాగా అసలు ఆ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో చెప్పాడు కార్తికేయ.
కార్తికేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ, ఊళ్లు తిరుగుతూ సినిమా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘వాలిమై’ గురించి కూడా మాట్లాడాడు కార్తికేయ. హీరోగా వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడు విలన్‌గా ఎందుకు చేశారు అనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ‘వాలిమై’ కథ తన దగ్గరకు వచ్చినప్పుడు అందులో హీరో అజిత్ అని తెలియగానే ‘నో’ ఎందుకు చెప్పాలి అనిపించిందట. దీంతో సినిమా ఒప్పేసుకున్నాడట.
నిజానికి ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత హీరోగా కార్తికేయకు సరైన హిట్ లేదు. అలాంటి సమయంలో విలన్‌గా చేస్తుండటంతో రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తున్నాడా అంటూ కొంతమంది సినీ విమర్శకులు అంటున్నారు. ఆల్‌రౌండర్ అనిపించుకోవడానికి కార్తికేయ ఇలా చేస్తున్నాడని ఇంకొందరు అంటున్నారు. ఏదైతేముంది రెండూ చేసి వినోదం అందిస్తే చాలు ప్రేక్షకులకు.