Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు
- September 17, 2026 / 07:25 PM ISTByFilmy Focus Desk
బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్ సినిమాలు ఇచ్చి.. ఆ తర్వాత కనిపించడకుండా పోయాడు కార్తికేయ గుమ్మకొండ. రెండేళ్ల నుండి ఆయన నుండి సినిమా లేదు. కనీసం సినిమా ఊసు కూడా లేదు. అసలు ఎక్కడకు వెళ్లిపోయాడు, ఏం చేస్తున్నాడు అనే సమాచారం కూడా లేదు. హీరోగా కాకపోయినా విలన్‌గా అయినా సినిమా చేస్తాడేమో అని ప్రేక్షకులు ఎదురు చూశారు. అది కూడా చేయలేదు సడన్‌గా ఇప్పుడు బయటకు వచ్చాడు. హీరోగా కాదు, విలన్‌గా కాదు, ముఖ్యమైన పాత్రతో కాదు.. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Karthikeya
అవును.. తొమ్మిదేళ్ల క్రితం ‘ప్రేమతో మీ కార్తిక్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ.. ఆ తర్వాత ఏడాది ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తర్వాత వరుసగా రెండు డిజాస్టర్ సినిమాలు ఇచ్చి కెరీర్ ముగిసిపోయే ప్రమాదంలోకి వెళ్లాడు. ఆసమయంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి తనలోని కొత్త యాంగిల్ చూపించాడు. ఆ తర్వాత అజిత్ ‘వలిమై’లో అదే పని చేసి మెప్పించాడు.
ఇక విలన్‌గా స్థిరపడిపోతాడేమో అనుకుంటే.. ‘బెదురులంక 2012’, ‘భజే వాయు వేగం’ సినిమాలు చేశాడు. రెండూ బాగున్నాయి అనిపించాయి. దీంతో కెరీర్ తిరిగి గాడిన పడ్డట్లే కనిపించింది. ఈ ఊపులో మరిన్ని సినిమాలు చేస్తాడనుకుంటే.. ఇండస్ట్రీ నుండి కనిపించకుండా పోయాడు. ఇప్పుడు తన కోసం సొంతంగా కథ రాసుకుని స్వీయ నిర్మాణంలో సినిమా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు కార్తికేయ.
ఈ సినిమాకు ఇటీవల పెద్దగా హడావుడి లేకుండా ముహూర్త వేడుక పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే ఆ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికే కార్తికేయ ఇంత గ్యాప్ తీసుకున్నాడని అర్థమవుతోంది. టాలీవుడ్‌లో ఈ మధ్య కొందరు యువ కథానాయకులు సొంతంగా సినిమాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వారి బాటలోనే కార్తికేయ కూడా చేరాడన్నమాట.ఇలాంటి ప్రయత్నం చేసిన మన హీరోలకు మంచి విజయాలు కూడా దక్కడం గమనార్హం.











