తమిళ నటుడు సత్యరాజ్ కి కట్టప్ప కొత్త పేరుగా మారింది. బాహుబలిలో ఆయన చేసిన పాత్రకు ప్రపంచమంతా మంచి పేరు వచ్చింది. వివిధ భాషల్లో అవకాశాలు తెచ్చి పెట్టాయి. సత్యరాజ్ ప్రస్తుతం దెయ్యం పాత్రతో అలరించడానికి మన ముందుకు రాబోతున్నారు. ఆయన తమిళ సినిమా “జాక్సన్ దొరై” లో వినూత్నంగా నటించారు. ఈ మూవీని తెలుగులో “దొర” గా తీసుకొస్తున్నారు.
ఇందులో తన కొడుకు శిభిరాజ్ తో కలిసి సత్యరాజ్ చేసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా సత్యరాజ్ “దొర” విశేషాలతో పాటు తనకు ఎంతో పేరు తీసుకువచ్చిన కట్టప్ప పాత్ర విశేషాలను వెల్లడించారు. బాహుబలి – ది బిగినింగ్ లో కంటే కంక్లూజన్ లో కట్టప్ప కీలకం కానున్నాడని, మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తాడని సత్యరాజ్ వివరించారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన భారీ సెట్స్ లో గత వారం రోజులుగా జరుగుతున్న బాహుబలి క్లైమాక్స్ షూటింగ్ లో త్వరలోనే తాను పాల్గొనబోతున్నట్టు చెప్పారు.