రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. తెలుగులో కన్నడ సినిమాలు పెద్ద వర్కవుట్ అవ్వవులే అనుకుంటున్న సమయంలో ‘కేజీఎఫ్’ రిలీజై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత సాయి కొర్రపాటి భారీ లాభాలను అందుకున్నారు. సినిమాపై రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే.. రూ.12 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. అయితే ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తోన్న ‘కేజీఎఫ్2’ పై ఉన్న క్రేజ్ చూస్తే..
తొలిభాగం కంటే ఐదారు రెట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘కేజీఎఫ్2’ హక్కుల డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే మొదటి పార్ట్ ను రిలీజ్ చేసిన సాయి కొర్రపాటి మీద నమ్మకంతో చాప్టర్ 2ని కూడా ఆయనకే ఇస్తున్నారు. అయితే ఈ సినిమా హక్కుల కోసం ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని సాయి కొర్రపాటికి కూడా భారీ రేటునే కోట్ చేశారట. టీజర్ రాకముందు వరకు ఈ సినిమా తెలుగు రైట్స్ డీల్ రూ.50 కోట్లు ఉండొచ్చని అందరూ అనుకున్నారు.
కానీ టీజర్ రిలీజైన తరువాత అంచనాలు బాగా పెరిగిపోవడంతో రూ.60 కోట్లకు పెరిగినట్లు తెలుస్తోంది. వేసవిలో 100శాతం ఆక్యుపెన్సీ ఉన్న సమయంలో సినిమాను రిలీజ్ చేస్తే.. భారీ సక్సెస్ ను అందుకోవడం ఖాయం. తెలుగులో రూ.60 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు.