కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు అంతంతమాత్రంగా ఆడి, లేదా ఫ్లాపై.. కొన్నేళ్ల తర్వాత కల్ట్ మూవీస్ గా నిలుస్తాయి. ఆ లిస్ట్ లో ప్రప్రథమంగా చెప్పుకోవాల్సిన సినిమా “ఖలేజా”(Khaleja) . త్రివిక్రమ్ (Trivikram) -మహేష్ బాబుల (Mahesh Babu) క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా ఇది. అక్టోబర్ 7, 2010 న విడుదలైన “ఖలేజా”పై మహేష్ అభిమానులకే కాక యావత్ చిత్రసీమకు భారీ అంచనాలు ఉండేవి. అప్పటికి విడుదల చేసిన టీజర్ ఓ సెన్సేషన్. చాన్నాళ్ళ విరామం అనంతరం ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఖలేజా సినిమాకి ఆశించిన స్థాయి స్పందన లభించలేదు.
ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ సినిమా విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యారు. దాంతో ఓ మోస్తరు ఓపెనింగ్స్ తో మొదలైన ఖలేజా బాక్సాఫీస్ వేట ఫ్లాప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు 30 కోట్ల రూపాయలతో రూపొందిన సినిమా 18 కోట్ల రూపాయల కలెక్షన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఖలేజాను మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా పేర్కొనేవారు. కట్ చేస్తే.. ఖలేజా టీవీ ప్రీమియర్స్ నుంచి సీన్ మారిపోయింది.
“ఇంత మంచి సినిమాని ఎందుకు ఫ్లాప్ చేసారు, TFI Failed Here” అనే నినాదాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఏకైంగా కల్ట్ స్టేటస్ ఇచ్చేసారు. అందుకే రీరిలీజ్ కి ఎన్నడూలేని విధమైన బుకింగ్స్ నమోదయ్యాయి. ఏకంగా నాలుగు కోట్ల రూపాయల మేర ప్రీ సేల్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కి హాజరైన నిర్మాత సి.కళ్యాణ్ (C Kalyan) “ఖలేజా” ఫ్లాప్ కి కారణం మహేష్ ఫ్యాన్స్ అని పేర్కొన్నారు. సినిమా రిలీజైనప్పుడు ఫ్యాన్స్ అందరూ ఫోన్లు చేసి “ఇదేం సినిమా” అంటూ బూతులు తిట్టారట.
ఒకరకంగా సినిమాని చంపేసింది మహేష్ ఫ్యాన్సే అంటూ సి.కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని కొందరు మహేష్ ఫ్యాన్స్ నిజమే అని ఒప్పుకుంటుంటే.. కొందరు మాత్రం ప్రొడ్యూసర్ గా నువ్వు పెద్ద ప్రమోషన్స్ ఏమీ చేయలేదు, అందుకే ఫ్లాపయ్యింది అంటూ సి.కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు.