చాలా కాలంగా హిట్టు లేక ఇబ్బంది పడ్డ రమేష్ వర్మ ‘రాక్షషుడు’ సినిమాతో పెద్ద హిట్టు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పెద్ద హీరోల దృష్టిలో పడ్డారు. రవితేజని ఒప్పించి ‘ఖిలాడి’ సినిమాను పట్టాలెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇప్పుడు ప్లాప్ అయి ఉండొచ్చు కానీ విడుదలకు ముందు ఈ సినిమాపై వచ్చిన బజ్ అంతా ఇంతా కాదు. సినిమా రషెస్ చూసిన నిర్మాత కోనేరు సత్యనారాయణ..
దర్శకుడు రమేష్ వర్మకి ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. అంతేకాదు.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘యోధ’ అనే వంద కోట్ల ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఇదొక పాన్ ఇండియా సినిమా అని.. ఇందులో స్టార్ హీరో నటించబోతున్నారంటూ మీడియాకు వెల్లడించారు. అయితే ‘ఖిలాడి’ సినిమా విడుదలై.. ఆయన అంచనాలను కూల్చేసింది. సినిమాకి డిజాస్టర్ టాక్ రావడంతో రమేష్ వర్మ డీలా పడిపోయారు. ఈ సినిమాకి వచ్చిన టాక్ ని బట్టి చూస్తుంటే..
రమేష్ వర్మ చేతుల్లో వంద కోట్ల ప్రాజెక్ట్ పెట్టడం చాలా పెద్ద రిస్క్ అవుతుంది. అలా చూసుకుంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రమేష్ వర్మ మిస్ చేసుకున్నట్లే. అయితే ఇప్పుడు మరోసారి తన సత్తా చాటే ఓ ఛాన్స్ అయితే రమేష్ వర్మ దగ్గర ఉంది. ‘ఖిలాడి’ కంటే ముందే ‘రాక్షసుడు 2’ సినిమా ప్రాజెక్ట్ సెట్ అయింది. దానికి కూడా కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘రాక్షసుడు’ సీక్వెల్ కాబట్టి దీనిపై మంచి అంచనాలు ఉంటాయి.
సీక్వెల్ క్రేజ్ తో భారీ లాభాలు అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ కూడా మొత్తం రెడీగా ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ పెద్ద హీరోల దృష్టిలో పడాలని చూస్తున్నాడు రమేష్ వర్మ. కానీ తెలుగులో సీక్వెల్స్ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. మరేం జరుగుతుందో చూడాలి!