కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్

ప్రతివారం వచ్చినట్లుగానే ఈవారం ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు “కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్”. టైటిల్ విని 2005లో హాలీవుడ్ లో వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు రీమేక్ అనుకొనేరు. ఆ సినిమాకీ దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆల్మోస్ట్ అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 14) విడుదలైంది. ట్రైలర్ అండ్ టైటిల్ తో అయితే యూత్ ఆడియన్స్ ను ఓ మేరకు ఆకర్షించిన ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ : ఆర్యన్ (కిరణ్) ఓ జర్నలిస్ట్, మెట్రీ లైఫ్ స్టైల్ కి అలవాటుపడి స్వీటీ (హర్షదా కులకర్ణి) అనే అమ్మాయితో సహజీవనం సాగిస్తుంటాడు. అయితే.. స్వీటీ తనకంటే తన డబ్బునే ఎక్కువగా సంపాదిస్తుందని భావించిన ఆర్యన్ ఒకానొక సందర్భంలో స్వీటీకి బ్రేకప్ చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు. అప్పట్నుంచి ఆర్యన్ జీవితమో అసలు సమస్యలు ఎదురవుతాయి. తాను చేయని మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు, కనీసం పేరు కూడా తెలియని ఒక మోడ్రన్ కాల్ గర్ల్ (వేశ్య) బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది, స్వీటీ కూడా తనను ఎక్కడికీ పంపొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఈ సమస్యల సుడి గుండంలో ఇరుక్కున్న ఆర్యన్ కి స్వీటీ ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో.. పోలీసుల గోల కూడా మొదలవుతుంది. అసలు ఆర్యన్ ఎవర్ని మర్డర్ చేశాడు, అందుకు కారణాలేమిటి, కాల్ గర్ల్ ఆర్యన్ ను ఎందుకు డబ్బు కోసం హెరాస్ చేస్తుంది, స్వీటీ ఎందుకు సూసైడ్ చేసుకొంది? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్” చిత్రం.

నటీనటుల పనితీరు : ఆర్యన్ కన్ఫ్యూజ్డ్ యూత్ క్యారెక్టర్ కి సరిపోయాడు. అయితే.. ఎమోషన్స్ కానీ హావభావాల ప్రకటనలో కానీ కనీస స్థాయి పరిణితి ప్రదర్శించలేకపోయాడు. ఇక హీరోయిన్ గా నటించిన హర్షదా కులకర్ణి హీరో పాత్రధారికి మూతి ముద్దులు పెట్టడం, ఆంగ్లంలో బూతులు తిట్టడం మినహా మరేం చేయలేకపోయింది. యాక్టింగ్ లో బేసిక్స్ కూడా రానందున శృంగార సన్నివేశాల్లో సహజంగా స్పందించడం మినహా మరేం చేయలేకపోయింది. వేశ్య పాత్రలో గాయత్రి గుప్తా డైలాగ్ వెర్షన్ లో ఉన్న వైల్డ్ నెస్ పాత్ర వ్యవహార శైలిలో కనిపించదు. మిగతా నటులందరూ గెటప్ పరంగా క్రూరులుగా కనిపించినా.. నటనతో పాత్రలను కనీస స్థాయిలో కూడా ఎలివేట్ చేయలేకపోయారు.

సాంకేతికవర్గం పనితీరు : జీవి మ్యూజిక్ సోసోగా ఉంది. ప్రణవ్ చాగంటి పాడిన టైటిల్ ట్రాక్ మినహా వేరే పాటలు పెద్దగా ఆకట్టుకోవు. నేపధ్య సంగీతం అయితే రెట్రో మిక్సా, ఫ్యూజన్ మిక్సా అనేది అర్ధం కాదు. సిద్ధ.కె సినిమాటోగ్రఫీ లైటింగ్ పరంగా చూసుకుంటే బాగోలేదనిపిస్తుంది కానీ.. పరిమిత వనరులతో ఆ స్థాయి ఔట్ పుట్ ఇచ్చాడంటే మాత్రం మెచ్చుకొని తీరాలి. అసలు అర్ధం కాని విషయం ఏంటంటే.. కేవలం ఓపెన్ బ్యాక్ డ్రాప్ కోసం గ్రీన్ మ్యాట్ వాడి ఎందుకు షూట్ చేశారు, ఒక టీవి చానల్ ఎడిటర్ కూడా చేయగల కనీసస్థాయి టెక్నాలజీ సైతం అందుబాటులో లేకుండా సినిమా ఎలా తీసారా అని.

ఇక దర్శకుడు రాసుకొన్న కథకి, వచ్చిన ఔట్ పుట్ కి అసలు సంబంధం లేదు అని ఇంటర్వెల్ బ్యాంగ్ తోనే అర్ధమైపోతుంది. కథలో ఆసక్తికరమైన అంశాలుగా రాసుకొన్న ట్విస్టుల ఎలివేషన్ సరిగా లేకపోవడం, ఏ ఒక్క క్యారెక్టర్ ను ఆడియన్స్ కు అర్ధమయ్యేలా చెప్పలేకపోవడం, సినిమాలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళ నటనను కాక వారి గ్లామర్ ను టార్గెట్ చేయడం, సినిమాలోని శృంగార సన్నివేశాల్ని శృంగారాత్మకంగా కాక హేయంగా చిత్రీకరించిన విధానం దర్శకుడి పనితనానికి నిదర్శనం.

విశ్లేషణ : సినిమా తీయాలనే ప్యాషన్ ఉండడం వేరు, డబ్బులున్నాయి కదా అని సినిమా తీయడం వేరు. ప్యాషన్ తో తీస్తే “అర్జున్ రెడ్డి, మళ్ళీ రావా” లాంటి చిత్రాలొస్తే, డబ్బుతో తీస్తే “కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్” లాంటి సినిమాలోస్తాయి. సినిమాకి పెట్టే బడ్జెట్, సినిమాలో నటించే హీరోయిన్స్ మీద మాత్రమే కాక కాస్త కథ-కథనాల మీద కూడా దర్శకనిర్మాతలు కాన్సన్ ట్రేట్ చేస్తే కనీస స్థాయి ఔట్ పుట్ అయినా వచ్చేదేమో. సో, సెన్స్ లేని సెక్స్ సీన్స్ మరియు సందర్భం లేని బూతులు ఎంజాయ్ చేసే ఆడియన్స్ మినహా మరెవ్వరినీ కొంచెం కూడా ఆకట్టుకోలేని చిత్రం “కిస్ కిస్ బ్యాంగ్ బ్యామ్”.

రేటింగ్ : 1/5

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus