కోలీవుడ్ ఎన్నో ఏళ్లుగా ఓ కల ఉంది. ఉదయం ఆరు గంటలకు సినిమా వేయాలని.. అలాగే కోలీవుడ్ అభిమానులకూ ఓ కోరిక ఉంది. తమ అభిమాన హీరోల సినిమాలను ఉదయం ఆరు గంటలకు ఫస్ట్ షో పడితే చూసేయాలని. దీని కోసం గత కొన్నేళ్లుగా సినిమా బృందాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో సరైన స్పందన రావడం లేదు. ఒకట్రెండు సినిమాలు, కీలక సందర్భాల్లో ఆ అవకాశాలు వచ్చాయి. అది కూడా చాలా తక్కువే.
అయితే, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయానికి వచ్చింది అని సమాచారం. అంతేకాదు ఈ నిర్ణయం ఇకపై అన్ని సినిమాలకూ వర్తిస్తుంది అని చెబుతున్నారు. సూర్య కొత్త సినిమా ‘సీన్’తో ఈ మార్పు వస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఒకరు ‘సీన్’ ప్రచారంలో మాట్లాడుతూ ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్నామని, ఉదయం ఆరు గంటల షోకి అనుమతులు వస్తాయని చెప్పారు.
ఈ మేరకు తమిళనాడు కొన్ని థియేటర్ల యాజమాన్యాలతో అగ్రిమెంట్లు చేసుకున్నామని, ప్రభుత్వ జీవో వచ్చిన తర్వాత ఈ విషయం ప్రకటన వస్తుందని చెబుతున్నారు. ఈసారి వచ్చే జీవో పర్మినెంట్ ఏర్పాట్లు చేసేలా ఉంటుంది అని చెబుతున్నారు. ఏదైనా సినిమా విడుదల అయ్యేటప్పుడు ఉదయం ఆరు గంటల షో వేద్దాం అనుకుంటే సమాచారం ఇచ్చి ప్రదర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో ఉదయం 9 గంటల నుండి మొదటి షో వేసుకోవడానికి మాత్రమే ఉంది. అందుకనే తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, థియేటర్ యజమానుల సంఘాలు ఉదయం 6 గంటల షోలకు శాశ్వత అనుమతి ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి విన్నవించాయి. మరి సినిమా పరిశ్రమ కష్టాలు తెలిసిన విజయ్ ఈ మేరకు సరైన నిర్ణయం తీసుకుంటారని కోలీవుడ్ ఆశిస్తోంది.