తమిళంలో మంచి విజయం సొంతం చేసుకొన్న “కాన” చిత్రానికి రీమేక్ గా రూపొందిన చిత్రం “కౌసల్య కృష్ణ మూర్తి”. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్ వెర్షన్ పై ట్రైలర్ వల్ల ప్రేక్షకులకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టాలెంటెడ్ యాక్ట్రస్ ఐశ్వర్య రాజేష్ తెలుగు డెబ్యూ సినిమా కావడం విశేషం. మరి ఈ తమిళ రీమేక్ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: తాను మాత్రమే కాదు తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుండాలని తాపత్రయపడే సగటు రైతు కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్). ఈయనకి క్రికెట్ చూడడం అంటే మహా పిచ్చి. తండ్రి క్రికెట్ చూసి మురిసిపోతుంటే.. తండ్రి కళ్ళల్లో ఆనందం చూసి మురిసిపోతుంటుంది కూతురు కౌసల్య (ఐశ్వర్య రాజేష్). తండ్రి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం క్రికెట్ ఆడాలనుకొంటుంది. ఆమె పట్టుదల చూసిన లోకల్ క్రికెటర్స్ ఆమెను ఎంకరేజ్ చేస్తారు. అలా మొదలైన కౌసల్య ప్రస్థానం ఇండియా టీం కి ఆడి వరల్డ్ కప్ గెలిచే వరకూ ఎలా సాగింది? ఈ క్రమంలో కౌసల్య మరియు ఆమె తండ్రి కృష్ణమూర్తి ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “కౌసల్య కృష్ణమూర్తి” కథాంశం.
నటీనటుల పనితీరు: తమిళంలో ఆల్రెడీ తాను పోషించిన పాత్రను మళ్ళీ తెలుగులో పోషించడం వలన అక్కడ చేసిన కొన్ని తప్పులు ఇక్కడ రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకొంది ఐశ్వర్య రాజేష్. ఆమె పాత్ర నిజమైన ఫెమినిజం & ఉమెన్ ఎంపవర్మెంట్ కి నిదర్శనంగా నిలుస్తుంది. ఆమె పాత్ర చాలా మంది అమ్మాయిలను ఇన్స్పైర్ చేస్తుంది.
రాజేంద్రప్రసాద్ తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడని చెప్పలేం కానీ.. ఆయన పెట్టుడు గెడ్డం మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంది. సినిమాలో ఎమోషన్, ఆయన పాత్రను పండించిన విధానం బాగున్నప్పటికీ.. ఆ పెట్టుడు గెడ్డం కారణంగా ప్రేక్షకుడి చూపు ఆ గెడ్డం మీదకే వెళ్లిపోతుంది.
తల్లి పాత్రలో ఝాన్సీ జీవించేసింది. ఒక మధ్య తరగతి గృహిణి జీవన విధానం ఆమె ముఖంలో ఉట్టిపడుతుంది.
పోలీస్ పాత్రలో వెన్నెల కిషోర్, సపోర్టింగ్ రోల్లో కార్తీక్ రాజు, అతిధి పాత్రలో శివకార్తికేయన్ సినిమా కథనానికి మంచి బలాన్ని అందించారు.
సాంకేతికవర్గం పనితీరు: దిబు నినన్ బాణీలు కొత్తగా ఉన్నాయి. నేపధ్య సంగీతం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ & ప్రొడక్షన్ వేల్యుస్ బాగున్నాయి.
భీమనేని శ్రీనివాసరావు రీమేక్ స్పెషలిస్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకొన్నాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించాడు. అలాగే.. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం కోసం రీషూట్ చేయాల్సిన అవసరం లేని చాలా సన్నివేశాలను, ముఖ్యంగా క్రికెట్ సీన్స్ మొత్తం తమిళం నుంచే చిన్నపాటి ఎడిటింగ్ మార్పులతో తెలుగులోనూ వాడేయడం గమనార్హం. అయితే.. తమిళ వెర్షన్ చూసినవారికి తప్ప ఎవరికీ ఈ విషయం అర్ధం కాకుండా తీసుకొన్న జాగ్రత్తలు అభినందనీయం.
సమాజంలో ఒక ఆడపిల్ల తన కాళ్లపై తాను ఎదగాలంటే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి? ఎన్ని ఎత్తుపల్లాలు అధిరోహించాలి? ఆశయ సాధన కోసం ఓ ఆడపిల్ల రోడ్డెక్కితే సమాజంలోని కొందరు వెధవలు ఆమెను వెనక్కి లాగడం కోసం ఎలాంటి కామెంట్స్ చేస్తుంటారు వంటివి ఈ చిత్రంలో చూపించిన విధానం బాగుంది. అలాగే.. క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కిన ఓ చిత్రంలో వ్యవసాయం ఈ దేశానికి ఎంత అవసరం, రైతులు తమ ఉనికిని ఎలా కోల్పోతున్నారు అనే అంశాలను కూడా హృద్యంగా తెరకెక్కించారు.
విశ్లేషణ: తమిళ వెర్షన్ చూడనివారు ఒక ఎమోషనల్ జర్నీని ఆస్వాదించడం కోసం “కౌసల్య కృష్ణమూర్తి” చిత్రాన్ని తప్పకుండా చూడాలి. వ్యవసాయం అనేది దేశ మనుగడకి ఎంత అవసరం అనేది తెలియజెప్పిన మరో మంచి చిత్రమిది.
రేటింగ్: 2.5/5