“తొంబై తొమ్మిది సినిమాలు చేసిన హీరో ఒక డైరెక్టర్‌తో ఇంత స్వేచ్ఛగా వ్యవహరించడం నేనెప్పుడు చూడలేదు. బాలకృష్ణ సింప్లిసిటీకి అదే నిదర్శనం” అని క్రిష్ చెప్పారు. నందమూరి నట సింహా వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిని తెరకెక్కిస్తున్నఈ డైరక్టర్ బాలయ్య గొప్పదనం గురించి చెప్పకుండా ఉండలేక పోయారు. బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి, దర్శకుడు క్రిష్ హాజరయ్యారు. రోగులతో కాసేపు ముచ్చటించారు. వారికి పండ్లు అందజేశారు. అనంతరం క్రిష్ మాట్లాడుతూ “ఈ క్యాన్సర్ ఆసుపత్రికి నా తల్లిని తీసుకువచ్చాను.
ఇంత గొప్ప ఆసుపత్రిని నిర్వహిస్తున్నందుకు బాలయ్యకు ధన్యవాదాలు. రోజుకు పద్నాలుగు గంటలు అలుపు లేకుండా నటించడం లెజెండ్ కే సాధ్యమన్నారు. తోటి ఆర్టిస్టులతో స్నేహితుడిగా కలిసిపోవడం అయన నిగర్వి అని చెప్పడానికి నిదర్శనమని ” అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండగానే సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “శకపురుషుడు గౌతమిపుత్రశాతకర్ణి శతాబ్దాలపాటు తన కోసం తాను వెతుకుతుంటే కనిపించిన ఆణిముత్యం బసవరామతారకపుత్ర బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు” అని క్రిష్ ట్విట్టర్లో పోస్ట్ చేసారు