కొత్త అందం, అందులోనూ హిట్ కొట్టిన అందం అయితే… టాలీవుడ్లో వరుస ఆఫర్లు వచ్చేస్తాయి అంటారు. అయితే ఆ అందానికి, హిట్‌కి కొంత క్యూట్‌నెస్, ఇంకొంత అదృష్టం కూడా ఉండాలనుకోండి. టాలీవుడ్లో ఇలాంటి అన్ని అంశాలు కలగలిపిన తాజా భామ కృతి శెట్టి. ‘ఉప్పెన’తో పరిచయమైన ఈ అమ్మడు… ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల గుండె చప్పుడు అనడంతో అతిశయోక్తి లేదు. అందుకే ఆరు లక్షల నుండి 50 లక్షల రెమ్యూనరేషన్‌కు చేరిందట.
‘ఉప్పెన’ సినిమా కోసం కృతి శెట్టికి మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ కేవలం ₹ఆరు లక్షల పారితోషికమే ఇచ్చిందని టాక్. కొత్తమ్మాయి కదా అంతే ఇవ్వొచ్చు. అయితే ఆ సినిమా ఇచ్చిన హైప్‌తో కృతి చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు వచ్చాయి. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. దీంతో తాజాగా సైన్ చేసిన ఓ సినిమాకు ₹50 లక్షల వరకు వసూలు చేసిందని తెలుస్తోంది. దీంతో వామ్మో… కృతి అదరగొట్టేసిందిగా అనుకుంటున్నారు అంతా.
ప్రస్తుతం కృతి చేతిలో ఉన్న సినిమాలు చూస్తే… నానితో ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తోంది. ఆ తర్వాత సుధీర్‌బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో చేస్తోంది. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగా… రామ్- లింగుస్వామి సినిమా ఓకే చేసేసింది. తాజాగా ‘బంగార్రాజు’ సినిమాలో నాగచైతన్య సరసన నటించేందుకు ఓకే చెప్పిందని టాక్. వీటితోపాటు మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలోఉన్నాయట. ముందు చెప్పిన ₹50 లక్షలు ‘బంగార్రాజు’ కోసమే అని టాక్.