చేసిన తొలి సినిమాతోనే ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదురా బాబూ.. అనిపించుకుంది కృతి శెట్టి. ‘ఉప్పెన’లో బేబమ్మగా కృతి శెట్టి నటన చూసి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’లో రెండు డిఫరెంట్ పాత్రలు చేసి మెప్పించింది. ఇప్పుడు తన మనసులోని పాత్ర అదేనండీ డ్రీమ్ రోల్ గురించి చెప్పింది బేబమ్మ. ఇక ఈ దిశగా దర్శకులు, రచయితలూ ఆలోచించి కథ, పాత్ర రెడీ చేయడమే ఆలస్యం.
చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించింది కృతి శెట్టి. ‘ఉప్పెన’కి ముందే ‘సూపర్ 30’లో చిన్న పాత్ర పోషించింది. అయితే అది పెద్దగా కనిపించని రోల్ అనుకోండి. అయితే వరుసగా యాడ్స్ అయితే చేస్తూ వచ్చింది. అనుకోకుండా వచ్చిన అవకాశం ‘ఉప్పెన’ను సద్వినియోగం చేసుకొని తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. మరోవైపు తమిళంలో కూడా అడుగుపెట్టింది. అలాంటి బేబమ్మకు రాజకుమారి పాత్రలో కనిపించాలనేది డ్రీమ్ రోల్ అట.
సింగిల్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయే అవకాశం చాలా తక్కువమంది అమ్మాయిలకే వస్తుంటుంది. అలా సింగిల్ సినిమా స్టార్ అయ్యి.. స్టార్ హీరోయిన్గా మారింది కృతి శెట్టింది. మరి మనసులో ఎలాంటి పాత్ర అనుకుంటున్నారు అనడిగితే.. అసలు విషయం చెప్పింది. ‘బాహుబలి’ సినిమాలో అనుష్క తరహాలో ఒక పవర్ఫుల్ రాజకుమారి పాత్రలో కనిపించాలని ఉంది అని చెప్పింది కృతి శెట్టి. అలాంటి పాత్ర చేస్తే ఆ కిక్కే వేరు అంటోంది.
ప్రస్తుతం కృతి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌తో ‘వారియర్’, నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లో నటిస్తోంది. ఇది కాకుండా సూర్యతో ఓ సినిమా ఇటీవల ఓకే చేసింది. ఈ సినిమా బాల దర్శకత్వంలో రూపొందనుంది. మొదటి మూడు సినిమాలు పూర్తి కమర్షియల్ అయినా… సూర్య సినిమా మాత్రం ప్రయోగాత్మకమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా చెప్పినట్లు అది బాల సినిమా. ఆయన సినిమాల సంగతి మీకు తెలుసు కదా.