“ఆటగదరా శివ, మిస్ మ్యాచ్” చిత్రాల ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా రూపొందిన తాజా చిత్రం “క్షణ క్షణం”. “కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్”తో దర్శకుడిగా మారిన మేడికొండ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడు. “అర్జున్ రెడ్డి” ఫేమ్ జియా శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 26) విడుదలైంది. మరి బృందం కనీసం టైటిల్ కైనా న్యాయం చేశారో లేదో చూద్దాం..!!
కథ: సత్య (ఉదయ్ శంకర్) ఓ సాధారణ యువకుడు. పెట్టిన ప్రతి బిజినెస్ ఫెయిల్ అవుతున్నా కూడా ఫ్రెండ్ దగ్గర డబ్బులు అప్పు చేసి మరీ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి పరిచయమవుతుంది ప్రీతి (జియా శర్మ). ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. అయితే.. పెళ్ళైన కొత్తలో ఉన్న ఆనందం మెల్లమెల్లగా దూరమవుతుంది. దాంతో డేటింగ్ యాప్ లో మాయ అనే అమ్మాయికి దగ్గరవుతాడు సత్య. మాయ తనకు ఆన్లైన్లో పరిచయమయ్యాక సత్యని అదృష్ట దేవత పలకరిస్తుంది. అప్పటివరకూ నష్టాల్లో సాగిన బిజినెస్ కి లాభాలు వస్తాయి. దాంతో ఆమెను కలవడానికి వెళ్తాడు. మాయను కలవడానికి వెళ్ళిన సత్యకు ఎలాంటి సమస్య ఎదురైంది? ఆ సమస్య కారణంగా సత్య జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అనేది “క్షణ క్షణం” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: మూడు సినిమాల్లో నటించినా నటుడిగా ఉదయ్ శంకర్ లో ఎలాంటి పరిణితి కనిపించలేదు. చాలా సన్నివేశాల్లో బేలగా కనిపించాడు. కీలకమైన క్లైమాక్స్ లో కూడా డల్ ఫేస్ తోనే కనిపించాడు కానీ సన్నివేశానికి అవసరమైన వేరియేషన్ ను మాత్రం చూపించలేకపోయాడు. జియా శర్మ పాత్ర చిన్నదే అయినా కథలో కీలకమైనది. ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. శ్రుతి సింగ్ కాస్త గ్లామర్ ను యాడ్ చేయడానికి ప్రయత్నించింది. రఘు కుంచె పాత్ర అలా వచ్చి పోతూ ఉంటుంది.
సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు రోషన్ సాలూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ ను పాత పాటల్ని రీమిక్స్ చేసి కొత్తగా అందించడానికి ప్రయత్నించాడు కానీ సన్నివేశానికి, సన్నివేశంలోని ఎమోషన్ కి నేపధ్య సంగీతం ఏమాత్రం సింక్ అవ్వలేదు. కొన్ని సన్నివేశాలకైతే కార్టూన్ బీజీయమ్ ఎందుకు పెట్టాడో అర్ధం కాలేదు. ఇప్పటివరకు నేను చూసిన సినిమాల్లో వీకేస్ట్ సినిమాటోగ్రఫీ వర్క్ ఈ చిత్రానిది. లైటింగ్ అసలు వాడారో లేదో డౌటే. కనీసం డి.ఐ చేయించినా బాగుండేది అనిపించింది. ఏదో ముబైల్లో బ్రైట్ నెస్ మొత్తం తగ్గించేసి చూస్తున్న ఫీల్. ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడుకోకపోవడం బెటర్.
ఇక దర్శకుడు ఈ చిత్రాన్ని థ్రిల్లర్ అని కాకుండా కామెడీ సినిమా అని ప్రమోట్ చేసి ఉంటే బాగుండేది. మర్డర్, ఎఫైర్ అనే అంశాలను నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించాడు సినిమా మొత్తం. ఒక మనిషిని చంపడం మరీ ఇంత సింపులా అనిపిస్తుంది. ఇక ఎండింగ్ లో ఇచ్చే జస్టిఫికేషన్ అయితే మరీ కామెడీగా ఉంటుంది. ఒక దర్శకుడిగా, కథకుడిగా మేడికొండ కార్తీక్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.చాలా బేసిక్ లాజిక్స్ కూడా పట్టించుకోలేదు.
విశ్లేషణ: మరో క్లాసిక్ టైటిల్ ను చెడగొట్టడం మినహా ఈ కొత్త “క్షణ క్షణం” సినిమా చేసిందేమీ లేదు. జియా శర్మ పెర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ కూడా లేవు. ఇక ఇంతకుమించి విశ్లేషించడానికి పద సంపద కూడా లేదు.
రేటింగ్: 1.5/5