‘పెద్ది'(Peddi) సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆమె ఇంట్రడక్షన్ సీన్స్ హీరోయిన్ ను కించపరిచే విధంగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయ్పడ్డారు. హీరో జాన్వీ మొహం గురించి మాట్లాడుతుంటే కెమెరా మాత్రం ఆమె ఆమె శారీరక సౌందర్యంపైనే ఫోకస్ పెట్టడం అనేది అందరికీ ఎబ్బెట్టుగా అనిపించింది. ఈ విషయంపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించి.. క్షమాపణలు చెప్పడమే కాకుండా ఆ సీన్లను డిలీట్ చేయడం కూడా జరిగింది.
అయినప్పటికీ చాలా మంది ఇంకా నోరుపారేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో అయితే ‘పెద్ది’ సినిమాని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది స్టార్స్ ఈ ఇష్యూపై స్పందించి తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
తాజాగా ఈ ఇష్యూపై స్టార్ హీరోయిన్ నిత్యా మేనన్ కూడా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను ‘పెద్ది’ సినిమా ఇంకా చూడలేదు. అయితే తెరపై మహిళలను కేవలం ఒక గ్లామర్ వస్తువుగా చూపించడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఈ ధోరణి కేవలం సౌత్ సినిమాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఉంది. బాక్సాఫీస్ వద్ద విజయం కోసం, ప్రేక్షకులను ఆకర్షించడానికే ‘హైపర్-కమర్షియలైజేషన్’ పేరుతో ఇలాంటి గ్లామర్ సీన్లు పెడుతున్నారు ఫిల్మ్ మేకర్స్.
నిజంగా ఇది హద్దులు దాటడమే.నటీనటులు కూడా తమకంటూ కొన్ని హద్దులు పెట్టుకోవాలి. నటీనటులుగా మనకి ఇష్టం లేని సీన్లు ఉంటే అవి చెయ్యము అని కచ్చితంగా చెప్పాలి. నాకైతే డబ్బు, పేరు ప్రతిష్ఠల కంటే విలువలే ముఖ్యం. అందుకే నేను కొన్ని రకాల పాత్రలకి దూరంగా ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది.