తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా యావత్ భారతీయ చిత్రసీమ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రూపొందబోయేదే. “ఆర్ఆర్ఆర్” (RRR) లాంటి ఆస్కార్ రేంజ్ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి చిత్రంపై హాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే.. రాజమౌళి & టీమ్ మాత్రం సినిమాకి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. మొన్న మహేష్ బాబు పుట్టినరోజుకి కనీసం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయినా ఉంటుందేమో అని ఎదురుచూసిన అభిమానులందరూ నిరాశ చెందారు.
కనీసం రాజమౌళి తన తదుపరి హీరో అయిన మహేష్ బాబుకు విషెస్ కూడా చెప్పకపోవడం మరింత బాధిందింది అభిమానులను. అయితే.. రాజమౌళి మౌనం వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. మహేష్ బాబుతో తెరకెక్కించబోయే చిత్రానికి ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ తో కంబైన్డ్ ప్రొడక్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని, ఓ ప్రఖ్యాత స్టూడియో ఆల్రెడీ నిర్మాణ భాగస్వామి అవ్వడం కోసం ఆసక్తి చూపిస్తోంది అని, సదరు డీల్ తాలుకు అగ్రిమెంట్లు పూర్తయ్యాకే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారని తెలుస్తోంది.
ఆ స్టూడియో ఏమిటి? ఎవరి భాగస్వామ్యం ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ.. ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం మహదానందంలో ఉన్నారు. ఇకపోతే.. మహేష్-రాజమౌళి కాంబినేషన్ సినిమాకి “గరుడ” అనే టైటిల్ పరీశలనలో ఉందని, 2028లో సినిమా విడుదలవుతుందని, భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే అన్నేళ్లపాటు వేచి చూడాలని వచ్చిన వార్తలపై రాజమౌళి బృందం ఎలాంటి స్పందన తెలుపలేదు.
సో, మహేష్ అభిమానులందరూ అప్పటివరకు బాబు ఎయిర్ పోర్ట్ లుక్స్ చూస్తూ, బాబు పుట్టినరోజుకి ఆయన పాత సినిమాల రీరిలీజ్ లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఓ మూడు నాలుగేళ్ళపాటు సంతోషపడడమేనన్నమాట. మరి రాజమౌళి తన స్టైల్లో ప్రెస్ మీట్ పెట్టి మహేష్ బాబు సినిమాను ఈ సంవత్సరమైనా ఎనౌన్స్ చేస్తాడో లేదో చూడాలి!